ఇటీవల ‘కరుప్పు’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో కెరీర్‌లో మరో సూపర్ హిట్ అందుకున్న సూర్య.. త్వరలో ఓ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం విడుదల తేదీని గురువారం ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు.
అంతర్జాతీయ పిస్టల్ షూటర్ ‘సంజయ్ విశ్వనాథ్’ పాత్రలో సూర్య నటిస్తుండగా మమతి బైజు తనకు జంటగా నటిస్తోంది. వీళ్లిద్దరి ఇరవై ఏళ్ల ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్య ఫస్ట్ టైమ్ తెలుగులో నటిస్తున్న చిత్రం అవడంతో పాటు ‘లక్కీ భాస్కర్’ లాంటి సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.
