
- ఖబరస్థాన్ కోసం స్థలం కేటాయిస్తాం: వివేక్ వెంకటస్వామి
- జూబ్లీహిల్స్ రహమత్ నగర్‌లో ముస్లింలతో మంత్రి సమావేశం
జూబ్లీహిల్స్, వెలుగు: తమ కుటుంబానికి మొదట నుంచి ముస్లిం సోదరులు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్‌లోని హెచ్ఎఫ్ నగర్‌లో ముస్లింలతో ఆయన సమావేశమయ్యారు. యూసఫ్ గూడ, వెంగళరావునగర్, బోరబండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ డివిజన్లకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొని, నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు.. ముస్లింలకు ఖబరస్థాన్ కోసం స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు అండగా ఉంటుందన్నారు.
దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖబరస్థాన్ కోసం స్థలాన్ని కేటాయించాలన్న ముస్లింల విజ్ఞప్తిని ఇటీవల తాను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో అనువైన స్థలాన్ని గుర్తించి ఖబరస్థాన్‌కు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా రహమత్ నగర్ డివిజన్‌లో రూ.20 కోట్లతో త్వరలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ అంటేనే.. పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, నేడు రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్, భవాని శంకర్‌తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనారిటీ మత పెద్దలు నాయకులు పాల్గొన్నారు.