- నిరుద్యోగులు దళారులను ఆశ్రయించవద్దు.. టామ్‌కామ్‌లో చేరండి
- విదేశాల్లో వారానికి 35 గంటల పని.. నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగం
- మందమర్రిలో జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్‌లో యువతతో ఇంటరాక్షన్
కోల్ బెల్ట్, వెలుగు: నైపుణ్యం కలిగిన యువతకు టామ్‌కామ్ ద్వారా శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్‌లో మంత్రి పాల్గొన్నారు. విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న సింగరేణి అప్రెంటిస్‌లు, ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ విద్యార్థులు, స్థానిక యువతతోనూ ఆయన మాట్లాడారు. వివిధ అంశాలపై యువత, విద్యార్థులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలిచ్చారు.
ఇంటర్, డిగ్రీ చేసిన వారికి విదేశాల్లో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయని, స్కిల్స్, జర్మన్ భాషపై పట్టు సాధిస్తే ఆ దేశంలో ఉద్యోగాలు పొందవచ్చని చెప్పారు. అందుకే టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి టామ్‌కామ్‌కు రూ.90 కోట్లు కేటాయించారన్నారు. మేస్త్రీ, ఫార్మసీ, హాస్పిటాలిటీ రంగాలతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి విదేశాల్లో డిమాండ్ ఉందని, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, గ్రీస్, యూరోప్ వంటి దేశాల్లో ఏటా 5 లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. అర్హత, నైపుణ్యం ఉన్నవారికి ఆయా దేశాల్లో వారానికి 35 గంటల పని.. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు.
ఉద్యోగ కల్పనకు సంబంధించి ఒప్పందం చేసుకునేందుకు జూన్ 3న జర్మనీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా 60 మంది సభ్యుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలవనుందన్నారు. జర్మనీకి వెళ్లే అభ్యర్థులకు వీసా, ఇతర ఖర్చులో ప్రభుత్వం సగం రాయితీ ఇస్తుందని చెప్పారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ప్రైవేట్ ఏజెన్సీలు, దళారులను ఆశ్రయించవద్దని, టామ్‌కామ్ సేవలను వాడుకోవాలని మంత్రి సూచించారు.
మందమర్రి నుంచి 100 మందికి ఉపాధి కల్పిస్తాం..
మందమర్రిలోని సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జర్మనీలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కోసం టామ్‌కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణా తరగతులు జూన్ 10 నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వారికి జర్మనీ భాష, స్కిల్స్‌పై ట్యూరర్ల ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సింగ్, ఫ్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మందమర్రి టామ్‌కామ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మొదటి బ్యాచ్‌లో 100 మందిని జర్మనీకి పంపాలన్నదే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ ఉద్యోగాలు కోరుకునేవారు ఆయా దేశాల భాషలు నేర్చుకోవాలని, మోడ్రన్ టెక్నాలజీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో అప్‌డేట్ కావాలని ఆయన సూచించారు.
పవర్ ప్లాంట్, ఓసీపీ విస్తరణతో ఉద్యోగాలు..
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా 850 మెగావాట్ల మూడో యూనిట్, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ రెండో ఫేజ్ కొత్త మైన్ ఏర్పాటు కానున్నాయని మంత్రి వివేక్ తెలిపారు. వీటితో 5 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాల వారికే ఉపాధి లభించిందని, తాను ఎమ్మెల్యే అయ్యాక సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు ఇచ్చేలా జీవో తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ, మందమర్రి తహసీల్దార్ సతీశ్ కుమార్, టామ్‌కామ్ సంస్థ మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
