తెలంగాణ ప్రజలు  మార్పు కోరుకుంటున్నరు: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ప్రజలు  మార్పు కోరుకుంటున్నరు: వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో వారు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘గడప గడపకు బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావుతో కలిసి ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ, సప్తగిరి కాలనీలో పర్యటించారు. కాలనీలోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ ప్రజా వ్యతిరేక విధానాలు, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివేక్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌ను గద్దెదించి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు గుణపాఠం చెప్పాలని వివేక్ కోరారు. అవినీతిరహిత పాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణలో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.