జూబ్లీహిల్స్, వెలుగు: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఉన్న వింధ్య బులియన్ గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ కార్యాలయంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వెంగళరావు నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న కమర్షియల్ భవనంలోని రెండో అంతస్తులో ఈ కంపెనీ ఆఫీసు ఉంది. ఇక్కడ రీనోవేషన్ పనులు జరుగుతుండగా ఎయిర్ కండిషనర్ నుంచి మంటలు చెలరేగి క్షణాల్లోనే కార్యాలయం అంతటా వ్యాపించాయి.
సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఏసీలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
