సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సిధారెడ్డి

సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సిధారెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డి 2025 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అకాడమీ  అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా సిధారెడ్డి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రూ.1లక్ష నగదుతోపాటు తామ్ర పతకాన్ని బహూకరించి దుశ్శాలువతో సత్కరించారు. 

కరోనా టైంలో సామాజిక పరిస్థితులపై సిధారెడ్డి రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. సిధారెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బందారం గ్రామంలో జన్మించారు. పాటలతో పాటు సామాజిక ఉద్యమకారుడిగా పేరుపొందారు.1997 ఆగస్టులో కేవలం ఒక గంట వ్యవధిలో ఆయన రాసిన ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ’ కవిత.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెను సంచలనం సృష్టించింది.