- హార్మూజ్పై ట్రంప్ వెనుకడుగు.. జలసంధి మూతపడితే తమకు నష్టం లేదని కామెంట్
- అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడి
- ఇతర దేశాల ప్రయోజనాల కోసం తమ సైనికులను బలిపెట్టలేమని వ్యాఖ్య
- మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి.. నాటో దేశాలకు తేల్చిచెప్పిన ప్రెసిడెంట్
- యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచిస్తున్నట్టు ప్రచారం
వాషింగ్టన్, దోహా: ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. నిన్న మొన్నటి వరకు హార్మూజ్ ను తెరవాల్సిందేనంటూ ఇరాన్ కు హెచ్చరికలు, అల్టిమేటం జారీ చేసిన ట్రంప్.. తాజాగా హార్మూజ్ విషయంలో ఇకపై తాము పట్టించుకోబోమని, మీ ఆయిల్ మీరే తెచ్చుకోవాలని నాటో దేశాలకు తేల్చి చెప్పారు.
దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో ఇతర దేశాల ప్రయోజనాల కోసం అమెరికా చేస్తున్న రక్షణకు ఇక స్వస్తి పలకనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించడానికి అమెరికా తన భారీ నౌకాదళాన్ని, నిధులను ఉపయోగిస్తోందని, కానీ దీనివల్ల అమెరికాకు వచ్చే లాభం ఏమీ లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"చైనా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు తమ అవసరాల కోసం ఈ మార్గాన్ని వాడుకుంటున్నాయి.. వాటి రక్షణ కోసం మేం ఎందుకు ఖర్చు చేయాలి?" అని ఆయన ప్రశ్నించారు. ఆయా దేశాలు తమ స్వంత నౌకాదళాలను పంపి చమురును రక్షించుకోవాలని ఆయన సూచించారు. అమెరికా ఇప్పుడు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని ట్రంప్ గుర్తు చేశారు. గతంలో లాగా చమురు కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడాల్సిన అవసరం అమెరికాకు లేదని, కాబట్టి హార్మూజ్ జలసంధి మూతపడినా లేదా అక్కడ ఉద్రిక్తతలు పెరిగినా అది నాటో, ఇతర దేశాల సమస్యే తప్ప అమెరికాది కాదని పేర్కొన్నారు. "అమెరికా ఫస్ట్" విధానంలో భాగంగా ఇతర దేశాల కోసం తమ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాల్లో మొదలైన గుబులు
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యూరప్, ఆసియా దేశాలు హార్మూజ్ జలసంధి రక్షణపై ఆందోళన చెందుతున్నాయి. అమెరికా గనుక అక్కడి నుంచి తప్పుకుంటే, ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక నాటో దేశాలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ట్రంప్ వ్యూహం ప్రపంచ ఇంధన మార్కెట్‌లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. కాగా, ఇరాన్‌తో చేస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ తన సన్నిహితుల వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.
యుద్ధం మాది, ఖర్చు మీది.. అరబ్ దేశాలకు ట్రంప్ కండీషన్
ఇరాన్‌తో జరుగుతున్న పోరాటంపై ట్రంప్ మరో సంచలన వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ఇరాన్ ముప్పును అడ్డుకోవడానికి అమెరికా చేస్తున్న సైనిక ఖర్చును ఇకపై ధనిక అరబ్ దేశాలే భరించాలని ప్రతిపాదించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘‘మా రక్షణ కావాలంటే.. దానికి తగిన ధర చెల్లించాల్సిందే’’ అనే స్పష్టమైన సంకేతాన్ని ట్రంప్ గల్ఫ్ దేశాలకు పంపారు.
ప్రాంతీయ భద్రత కోసం అమెరికా తన బడ్జెట్‌ను భారీగా వెచ్చిస్తోందని, దీనివల్ల అరబ్ దేశాలకే ఎక్కువ లాభమని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఇరాన్‌పై జరుగుతున్న ఈ యుద్ధ కార్యకలాపాలకు అయ్యే బిలియన్ల డాలర్ల ఖర్చును సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు పంచుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు.
