- బయోమెట్రిక్‌కు స్వస్తి... యాప్ ద్వారా అటెండెన్స్
- పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో అటెండెన్స్ పద్ధతి మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలికి, దాని స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానాన్ని కేవలం స్టూడెంట్స్‌కే కాకుండా లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికీఅమలు చేయనున్నారు.
విద్యాశాఖ రూపొందించిన అటెండెన్స్ యాప్‌లో రిజిస్టర్ చేసి, దాని ద్వారా మాత్రమే హాజరుగా నమోదు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో అధికారికంగా ఫెషియల్ అటెండెన్స్ ప్రారంభంకానున్నది.
149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో..
రాష్ట్రవ్యాప్తంగా 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా, వీటిలో సుమారు లక్షన్నర మంది విద్యార్థులు చదువుతున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ సుమారు 4 వేల మంది, నాన్ టీచింగ్ సిబ్బంది 1,500 మంది వరకు ఉన్నారు. వారంతా ఫేస్ స్కాన్ ద్వారా హాజరు వేసుకోవాల్సిందేనని అధికారులు చెప్తున్నారు.
పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..
మార్చి15 నుంచి రాష్ట్రంలోని సిటీ కాలేజీ, విద్యానగర్ డిగ్రీ కాలేజీ, కేడీసీ వరంగల్, కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేశారు. ఇది సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టూడెంట్లు, ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, ప్రతిరోజూ హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రిన్సిపాల్స్‌కు అధికారులు ఆదేశాలించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్1 నుంచి సమగ్రంగా అమలు కానున్నది.
బయోమెట్రిక్ తిప్పలు తప్పనున్నాయి..
కొన్నేళ్లుగా కాలేజీల్లో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం, మెషిన్ల వద్ద రద్దీ, టెక్నికల్ లోపాలతో సమస్యలు ఎదురయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సమస్యలకు చెక్‌పెడుతూ ఫేషియల్ రికగ్నిషన్ వైపు అధికారులు దృష్టి సారించారు.
కొత్త పద్ధతిలో విద్యార్థులు, సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా యాప్‌లో ముఖాన్ని స్కాన్ చేస్తే హాజరు నమోదవుతుంది. దీంతో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సర్కారు నిధుల దుర్వినియోగాన్ని నివారించవచ్చని అధికారులు చెప్తున్నారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ..
పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ఎఫ్ఆర్ఎస్విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 115 గవర్నమెంట్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, అందులో సుమారు 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఎఫ్ఆర్ఎస్ విధానం అమలు చేయనున్నారు. వారితో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికీ ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు తప్పనిసరి చేశారు.
వారు ఎస్బీ టీఈటీ యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. కాగా, కేవలం గవర్నమెంట్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ విధానం పెట్టడంతో అడ్మిషన్లు తగ్గే అవకాశం ఉందని, ప్రైవేట్‌లోనూ దీన్ని కొనసాగించాలని కళాశాల విద్య జేఏసీ చైర్మన్లు ప్రొఫెసర్ సంగి రమేశ్, సురేందర్ రెడ్డి, జేఏసీ ప్రెసిడెంట్ బ్రిజేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
