అగ్నివీర్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

అగ్నివీర్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాలకు సంబంధించి దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 1 చివరి తేదీగా నిర్ణయించినట్టు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు వెల్లడించింది. అగ్నివీర్ కేటగిరీల్లో అవివాహిత యువత కోసం నియామక నోటిఫికేషన్‌‌ను ఫిబ్రవరి 13న విడుదల చేసింది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు దీనికి అప్లై  చేసుకోవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌‌మన్ (10వ తరగతి), అగ్నివీర్ ట్రేడ్స్‌‌మన్ (8వ తరగతి) కేటగిరీల్లో జరుగుతుంది. అభ్యర్థులు తమ అర్హతల ప్రకారం గరిష్టంగా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అగ్నివీర్ నియామకానికి గరిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలకు పెంచారు.

ఆన్‌‌లైన్ కామన్ ఎంట్రన్స్ పరీక్షను తెలుగుతో సహా 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌‌సీసీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు ఉంటాయి. ఎగ్జామ్స్ 2026 జూన్ 1 నుంచి జూన్ 15  మధ్య నిర్వహించనున్నట్టు తెలిపారు. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌‌సైట్ ద్వారా డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక www.joinindianarmy.nic.in వెబ్‌‌సైట్‌‌ను పరిశీలించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 040–-27740059 ఫోన్ నంబర్‌‌ను సంప్రదించవచ్చు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. మధ్యవర్తులు, మోసగాళ్ల మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. కేవలం ప్రతిభ, కష్టపడి సిద్ధమైన వారికే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.