- అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క
- మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి రూ.10 వేల కోట్లను ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తెలిపారు. రాబోయే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్లకుపైగా వడ్డీలేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు.
ఉచిత ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులకు ఉపయోగపడుతున్నాయన్నారు. మహిళల ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం కావడంలో డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర మరువలేనిదని అభినందించారు.
రోజుకు 65 లక్షల మంది ప్రయాణికుల్లో 40 లక్షల మంది మహిళలేనని, ఆర్టీసీని కాపాడుతూ రాయితీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.ఆర్టీసీ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తూ, కొత్త బస్సులు కొనుగోలు చేసి మరిన్ని రూట్లలో సేవలు విస్తరిస్తామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంపై విమర్శలు చేసే వారికి మహిళలే సమాధానం చెప్పాలని, ఉచిత ప్రయాణంతోపాటు వారిని ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశామని స్పష్టం చేశారు.
సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు మహిళలకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అప్పటి వరకు విశ్రమించేది లేదన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న రూ. 10 వేల కోట్ల మెగా చెక్కును మంత్రులు పొన్నం, సీతక్క.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, మహిళలు పాల్గొన్నారు.
