న్యూఢిల్లీ: పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతున్నట్టు ఉంది. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్న ముడి చమురు ధరలు, బలహీనపడుతున్న రూపాయి విలువ మనదేశ దిగుమతులపై పెను భారం మోపుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి–మార్చి 27 మధ్య కాలంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 60.75 డాలర్ల నుంచి 105.32 డాలర్లకు చేరింది.
ఇది సుమారు 73.4 శాతం పెరుగుదల. రూపాయి విలువ 89.96 నుంచి 94.59 కు పడిపోయింది. అంటే 5.1 శాతం తగ్గింది. చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం, ఎరువుల దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా డాలర్లలోనే చెల్లిస్తుంది. ఈ రెండు రకాల ఒత్తిళ్ల వల్ల దేశ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. 2025 మధ్య నుంచి రూపాయి విలువ క్రమంగా తగ్గుతున్నప్పటికీ, అప్పట్లో కొన్ని అంశాలు వెసులుబాటు కల్పించాయి.
2025-–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు. 2026 ప్రారంభంలో చమురు ధరలు కొంత తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు రాలేదు. గత నవంబర్, డిసెంబర్లో సీపీఐ ద్రవ్యోల్బణం 0.7 శాతం నుంచి 1.3 శాతం మధ్య ఉంది. ప్రస్తుత పరిస్థితులు వాణిజ్య లోటును భారీగా పెంచుతున్నాయి. 2025-–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు భారత వాణిజ్య లోటు 310.60 బిలియన్ డాలర్లకు పెరిగింది.
యుద్ధం ఆగకుంటే మరిన్ని కష్టాలు..
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే పరిస్థితి విషమిస్తుందని ఎర్నెస్ట్యంగ్రిపోర్ట్హెచ్చరించింది. దీని రిపోర్ట్ ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాల నుంచి ఒక శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరగొచ్చు. దుస్తులు, పెయింట్లు, రసాయనాలు, ఎరువులు, సిమెంట్, టైర్ల వంటి రంగాలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.
దీనివల్ల ఆయా రంగాల్లో ఉపాధి, ఆదాయాలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి. అందుకే రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటోంది. గత నెల 27న ఆర్బీఐ ఫారెక్స్డీలర్ల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది.
అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష కోట్లతో ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ (ఈఎస్ఎఫ్) ఏర్పాటు చేసింది. ఇది ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓఈసీడీ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా ఉన్న భారత వృద్ధి రేటు వచ్చే ఏడాది 6.1 శాతానికి పడిపోయే అవకాశం ఉంది.
