మిషన్‌‌ భగీరథలో వాడినవన్నీ పాత పైపులే: వివేక్‌‌ వెంకటస్వామి

మిషన్‌‌ భగీరథలో వాడినవన్నీ పాత పైపులే: వివేక్‌‌ వెంకటస్వామి
  • పైపులు పాడవ్వడంతో గ్రామాలకు నీళ్లు వస్తలేవు: వివేక్‌‌
  • కాంట్రాక్టర్‌‌‌‌కు లబ్ధి చేకూర్చేలా గత సర్కార్‌‌‌‌ వ్యవహరించిందని ఆరోపణ
  • ఎండాకాలంలో తాగు నీటి సమస్యను తీర్చాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి
  • చెన్నూరు నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిషన్‌‌ భగీరథ స్కీమ్‌‌ ఫెయిల్‌‌ అయిందని, పైపులన్నీ పాడవ్వడంతో చాలా గ్రామాలకు నీళ్లు రావడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. కొన్ని చోట్ల మురికి నీళ్లు వస్తుండడంతో, ప్రజలు వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. శుక్రవారం అసెంబ్లీ జీరో అవర్‌‌‌‌లో వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయిన్‌‌కు వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో తాగు నీటి సమస్యను ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. వెంకటస్వామి ఫౌండేషన్, విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో బోర్లు వేయించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేశారన్నారు.

అలాగే, మళ్లీ బోర్లు వేయించాలని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో వంద బోర్‌‌‌‌ వెల్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినప్పటికీ, బోర్లు వేయడానికి పర్మిషన్ లేదని అధికారులు చెప్పారన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంపై విచారణ జరిపిస్తే, 70 శాతం పైపులు పాడైపోయినట్టు తేలిందన్నారు. పైపుల కాంట్రాక్టర్‌‌‌‌కు లాభం చేకూర్చేందుకే మిషన్ భగీరథ సప్లయ్‌‌లో పాత పైపులను వినియోగించారని ఆరోపించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివేక్‌‌ కోరారు. ఎండాకాలం వస్తే నీళ్లకు ఇబ్బందవుతుందని, ముందే చర్యలు తీసుకొని తన సెగ్మెంట్​ ప్రజలకు నీళ్ల సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథపై సమీక్షించి, సచ్ఛమైన నీటిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను వివేక్ వెంకటస్వామి కోరారు.

పత్తి కొనుగోళ్లు పెంచండి..

చెన్నూరు నియోజకవర్గంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం వల్ల లారీలు రోడ్లపై నిలిచిపోతున్నాయని, దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పారు. రోజుకు కనీసం 200 లారీలు ఏర్పాటు చేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు.