కేసీఆర్ నియంతృత్వం వల్లే.. బీఆర్ఎస్ ఖాళీ: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ నియంతృత్వం వల్లే.. బీఆర్ఎస్ ఖాళీ: వివేక్ వెంకటస్వామి
  •    అహంకారానికి  ప్రజలు బుద్ధిచెప్పారు: వివేక్ వెంకటస్వామి 
  •     అధికారంలో ఉన్నప్పుడు అందర్నీ వేధించారు
  •     ఉద్యమకారులను అణచివేశారని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్​ఒక నియంతలా వ్యవహరించారని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు​ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి విమర్శించారు. ఆయన అహంకారానికి, నియంతృత్వ పాలనకు గత ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. శనివారం తెలంగాణ జన సమితి కార్యాలయంలో జరిగిన ఇఫ్తార్ ​విందులో వివేక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన అంతా అవినీతి, కుంభకోణాలమయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్​అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయన్నారు. ఆయన బిడ్డ కవిత లిక్కర్​స్కామ్​లో జైలుకు వెళ్లారన్నారు.

కేసీఆర్ ​తనకు ఎదురే లేదన్నట్టుగా నిరంకుశ పాలన చేస్తూ ప్రశ్నించేవారిని అణిచివేశారని.. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ​స్వయంకృతాపరాధం వల్లే ఆ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ప్రకటించిన అభ్యర్థులు సైతం ఇప్పుడు పోటీ చేయకుండా పార్టీని వీడుతుండడం చూస్తే ఆ పార్టీ పరిస్థితి అర్థం అవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం వంటి వారు ఉద్యమంలో కీలకంగా పని చేశారన్నారు. రాష్ట్రం కోసం ఎంతో మంది కొట్లాడితే.. అధికారంలోకి రాగానే ఉద్యమ కారులను, కోదండరాం​ వంటి వారిని కూడా పక్కనబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. బలిదానాలతో వచ్చిన తెలంగాణలో గద్దెనెక్కిన కేసీఆర్ పదేండ్ల పాటు తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తూ జులూం చేశారన్నారు.