సింగరేణిని ప్రైవేటు కానివ్వం రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటది: వివేక్ వెంకటస్వామి

సింగరేణిని ప్రైవేటు కానివ్వం రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటది: వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్ అవినీతిపై నాలుగేండ్లు పోరాడినం
  • కొత్త గనులు, జాబ్స్ రావాలంటే 
  • ఐఎన్‌టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి
  • గనుల వద్ద ప్రచారం నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ ప్రైవేటీపరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందని తెలిపారు. కార్మికులు అపోహలను వదిలేయాలని, సంస్థకు సర్కార్, సీఎం రేవంత్​ రెడ్డి అండగా ఉంటారని చెప్పారు. కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు రావాలంటే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చినట్టే.. సింగరేణి కార్మికులకు ఐఎన్‌‌టీయూసీ ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని చెప్పారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ఐఎన్‌‌టీయూసీ తరఫున ప్రచారం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5, కాసీపేట1, కాసీపేట2, కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, ఎస్​అండ్​పీసీ, ఆర్కేపీ సింగరేణి ఏరియా ఆసుపత్రి, సీహెచ్​పీ, సింగరేణి జీఎం ఆఫీసు దగ్గర గేట్ మీటింగుల్లో పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు.. సింగరేణి కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం.. రూ.20 లక్షల వడ్డీ లేని రుణం.. పెర్క్స్ పై ఇన్​కమ్ ట్యాక్స్‌‌ను యాజమాన్యం చెల్లించడం.. మహిళలకు సంస్థలో భద్రత, గౌరవం.. కొత్త గనులు, కొత్త ఉద్యోగాల కల్పన, సింగరేణి ఆసుపత్రుల నుంచి హైదరాబాద్‌‌కు రెఫరల్ ​విధానం అందుబాటులోకి తీసుకు వస్తామని వెల్లడించారు.

తాడిచెర్ల మైన్‌‌ డీల్‌‌లో రూ.40 వేల కోట్ల స్కామ్

కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి ప్రజలు తెలంగాణను విముక్తి చేసి కాంగ్రెస్ ప్రజా పాలన తెచ్చారని వివేక్ అన్నారు. ‘‘ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నా. కానీ చెన్నూరు ప్రజల అకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. బాల్క సుమన్​ఇసుక దందాతో వేల కోట్లు దండుకోవడంపై దృష్టి పెట్టి.. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాడు. అందువల్లే నేను పోటీకి దిగిన. ఎన్నికలకు 23 రోజుల ముందు ప్రచారానికి దిగినా.. చెన్నూరు ప్రజలు ఆదరించి 37,189 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. వారికి నా కృతజ్ఞతలు” అని తెలిపారు. కాకా వెంకటస్వామి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని, ఆయన ఇచ్చిన ధైర్యంతో కేసీఆర్ అవినీతి, అక్రమాలపై నాలుగేండ్లు పోరాటం చేశామన్నారు. ‘‘సింగరేణి సమస్యలు తీర్చాలని కేసీఆర్‌‌‌‌ను కోరితే అధికార గర్వంతో పట్టించుకోలేదు. తాడిచెర్ల మైన్‌‌ను జెన్ కో ద్వారా ప్రైవేట్ కంపెనీకి అప్పగించి సింగరేణి సంపదను కేసీఆర్ దోచుకున్నాడు. ఈ డీల్​లో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగింది” అని తెలిపారు.

కేసీఆర్ తుగ్లక్ ఆలోచనతో కాళేశ్వరం కట్టిండు 

కేసీఆర్ తుగ్లక్ ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని వివేక్ ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతిపై మొదట మాట్లాడింది తానేనన్నారు. సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్​పరిధిలోకి వెళ్తే.. సంస్థను కాపాడేందుకు కాకా వెంకటస్వామి అప్పటి ప్రధాని పీవీపై ఒత్తిడి తెచ్చి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లను ఇప్పించారన్నారు. కాకా వల్లే లక్ష మంది కార్మికుల ఉద్యోగాలు నిలబడ్డాయన్నారు. సింగరేణికి వెయ్యి కోట్ల లాభాలు వస్తున్నాయంటే కాకా ఒత్తిడితో అప్పటి సర్కార్ ​తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. బొగ్గు గనుల కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ ​స్కీం, కార్మిక వాడలకు గోదావరి వాటర్ అందించిన ఘనత కాకాకే దక్కుతుందని చెప్పారు.

సింగరేణికి అండగా రాష్ట్ర సర్కార్

సింగరేణికి అండగా రాష్ట్ర సర్కార్ ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థను ప్రైవేటుపరం కానివ్వబోదని వివేక్ చెప్పారు. ‘‘సింగరేణిలో ప్రస్తుతం 65 మిలియన్ ​టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. దాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచాలి. విదేశాల నుంచి 150 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి అవుతున్నది. దీన్ని అడ్డుకోవడానికి కొత్త గనులు ప్రారంభించాల్సిన అవసరముంది. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగితే కార్మికులకు లాభాల్లో వాటా పెరుగుతుంది” అని వివరించారు. తాను ఎంపీగా ఉన్న టైమ్‌‌లో రామగుండం ఎరువుల కార్మాగారాన్ని రీఓపెన్ ​చేయించేందుకు రూ.10 వేల కోట్లను ఇప్పించి.. 5 వేల మంది ఉద్యోగాలను కాపాడినట్లు చెప్పారు. ఓసీపీ, పవర్ ప్లాంట్‌‌లో 80% ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్​ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని సీఎం రేవంత్​ రెడ్డిని కోరితే ఆయన ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ ​యూనియన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ లీడర్లు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.