ప్రజలు కోరుకున్న మార్పు వచ్చింది.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఎంతో మేలు

ప్రజలు కోరుకున్న మార్పు వచ్చింది.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఎంతో మేలు
  •     కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి
  •     రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
  •     సీఎం రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి
  •     చెన్నూర్‌‌‌‌లో బాల్క సుమన్ రాక్షస పాలన ముగిసిందని కామెంట్

కోల్ బెల్ట్, వెలుగు : రాష్ట్ర ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గురువారం చెన్నూర్‌‌‌‌ నియోజకవర్గంలోని చెన్నూర్, జైపూర్, భీమారంలో వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూర్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు, మిషన్ భగీరథలో రూ.80 వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్​రెడ్డికి అప్పీల్ చేస్తున్నా’’ అని చెప్పారు. రూ.68 వేల కోట్ల మిగులు బడ్జెట్‌‌తో ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్ సర్కారు రూ.6 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే వైట్ పేపర్ రిలీజ్ చేయాలని సీఎంకు వివేక్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన ఫండ్స్​ను కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టి నిండా ముంచారని బీఆర్ఎస్‌‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇకపై ప్రతిదీ చట్ట ప్రకారం జరగాలని, రెవెన్యూ, పోలీస్ విధానాలు రాజ్యాంగ ప్రకారం నడవాలని చెప్పారు.

బాల్క సుమన్‌‌ను జనం తరిమికొట్టారు..

‘‘బట్టలిప్పి కొడుతానన్న బాల్క సుమన్‌‌ను చెన్నూర్ ప్రజలు బట్టలిప్పి తరిమికొట్టారు. నియోజకవర్గంలో బాల్క సుమన్ రాక్షస, నిరంకుశ పాలన అంతమైంది’’ అని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా చెన్నూర్ లో మంచినీటి సమస్య తీరుస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు త్వరలోనే స్కిల్ డెవలప్​మెంట్​సెంటర్ ప్రారంభిస్తానని చెప్పారు. ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల అవసరాలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు న్యాయం చేసేందుకు ఏడాదిలో కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. ‘‘చెన్నూర్ ప్రజలు నాపై చాలా ప్రేమ చూపించారు. నా విజయం కోసం మాజీ ఎమ్మెల్యే ఓదెలు, ఇతర నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషిచేశారు. నాకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అని వివేక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చాలా మంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, కానీ  తమ వాళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన నేతలను పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

వివేక్​కు పార్టీ శ్రేణుల ఘన స్వాగతం 

చెన్నూర్‌‌‌‌ ఎమ్మెల్యేగా గెలిచి.. తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన వివేక్ వెంకటస్వామికి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జైపూర్ మండలంలోని ఇందారం, జైపూర్, భీమవరం మండల కేంద్రం, చెన్నూరులోని కాంగ్రెస్ ఆఫీసులో ఆయనకు సన్మానం చేశారు. చెన్నూర్‌‌‌‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుశీల్ కుమార్ బావ ఓదెల శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా.. ఆయన ఇంటికి వెళ్లి వివేక్ పరామర్శించారు. చెన్నూర్ మండలం కిష్టంపేటలో బైరి వంశీకృష్ణ, శ్రీజ.. చెన్నూర్‌‌‌‌లో చెన్నూరి సతీష్, తిరుమల వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. జైపూర్ ఏసీపీ మోహన్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేశారు.