కేసీఆర్ సర్కారు పోవుడు ఖాయం : వల్లపురెడ్డి రవీందర్​ రెడ్డి

కేసీఆర్  సర్కారు పోవుడు ఖాయం  :  వల్లపురెడ్డి రవీందర్​ రెడ్డి

మంచిర్యాల, వెలుగు: అవినీతి, నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న కేసీఆర్  సర్కారును ఇక భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్​ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్​కో హఠావో, కాంగ్రెస్​కో జితావో, తెలంగాణకో బచావో’ పేరుతో చేపట్టిన తెలంగాణ ప్రజా సంఘాల జన చైతన్య యాత్ర మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి నివాసంలో మీడియాతో రవీందర్  రెడ్డి మాట్లాడారు. కేసీఆర్​ మాయమాటలతో గారడీ చేస్తూ ప్రజలను భ్రమల్లోకి నెట్టేశారని, ఉద్యోగాలు రాక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జాబ్​ నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. 

ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు బీఆర్ఎస్​ కార్యకర్తలకే దక్కాయన్నారు. రైతు బంధు పేరుతో రైతుల హక్కులన్నీ కాలరాశారని, ఇన్​పుట్​ సబ్సిడీ, అవుట్​ సబ్సిడీ తీసేశారని, ఎరువుల ధరలు పెంచారని ఫైర్  అయ్యారు. రైతు కొడుక్కు ఉద్యోగం ఇవ్వరు కానీ రైతు చనిపోతే బీమా ఇస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని, తొమ్మిదిన్నరేండ్లలో ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిందన్నారు. 

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో కేసీఆర్​ సర్కారు పతనం ఖాయమైందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్​ పార్టీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అందుకే కేసీఆర్​ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న కాంగ్రెస్​కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.