కార్నర్ మీటింగ్​లు అన్ని చోట్ల పెడ్తం: వివేక్ వెంకటస్వామి

కార్నర్ మీటింగ్​లు అన్ని చోట్ల పెడ్తం: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రజా గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో కార్నర్​మీటింగ్ లు నిర్వహిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి  తెలిపారు. ఇందుకోసం 11 వేల శక్తి కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 4 వేల శక్తి కేంద్రాలకు మెటీరియల్ పంపించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నారాయణగూడ వెంకటేశ్వర కాలనీ కమ్యూనిటీ హాల్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ లకు సంబంధించిన మెటీరియల్ ను మంగళవారం పార్టీ నేతలతో కలిసి వివేక్ పరిశీలించారు. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..  కరోనా టైమ్​లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో మేలు చేసిందన్నారు. ఉచితంగా రేషన్ పంపిణీ చేసిందని, వ్యాక్సిన్లు వేసిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వల్ల కూడా ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. పేదలకు ఇండ్ల కోసం పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కేటాయింపులను రూ. 40 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లకు పెంచిందన్నారు. 

కేసీఆర్ పాలన అంతమే లక్ష్యం: జితేందర్ రెడ్డి 

కేసీఆర్​అరాచక పాలన అంతమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందని జితేందర్ రెడ్డి తెలిపారు. కోటికి పైగా పోస్టర్లు, 65 లక్షల జెండాలు , 65 లక్షల కండువాలు, 25 వేల హ్యాండ్ బాండ్స్, 20 లక్షల పువ్వు గుర్తులను హైకమాండ్ పంపినట్లు చెప్పారు. బీజేపీ అండగా ఉంటుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే శక్తి కేంద్రాల ముఖ్య ఉద్దేశం ఉన్నారు. ఈ నెల 10 నుంచి 25 వరకు 800 మంది స్పీకర్స్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రజల మేలు కోసమే పని చేస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ స్ట్రాంగ్ అయిందని, మరింత బలోపేతం కోసమే ఇలాంటి మీటింగ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా శక్తి కేంద్రాలు పని చేస్తాయని చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.