- గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేంద్రం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్
- ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
- మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
నర్సాపూర్/తొగుట (దౌల్తాబాద్), వెలుగు: కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన ఆస్తి గొడవల కారణంగానే కవిత కొత్త పార్టీ పెట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రూ.15 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లో నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి కేసీఆర్ కూతురు కవితే స్వయంగా చెప్పారని.. కేసీఆర్, హరీశ్ రావు కుటుంబ ఆస్తుల గొడవల నేపథ్యంలోనే కవిత బయటకు వెళ్లి పార్టీ పెట్టారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన బీఆర్‌ఎస్.. ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేసి, అవసరమైన నిధులు మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయిస్తోందన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి కింద లోన్లు ఇవ్వడంతో పాటు వడ్డీ మాఫీ డబ్బులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మహిళా సంఘాలకు పెట్రోల్‌బంక్‌లు, బస్‌ల కొనుగోలుకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజలందరూ సన్న బియ్యంతో భోజనం చేయాలన్న ఆలోచనతోనే రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందుకు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందిస్తుండడంతో పాటు, సన్న వడ్లను పండించిన వారికి రూ.500 బోనస్ ఇస్తున్నట్టు గుర్తుచేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 100 కోట్లు కేటాయించాలని సీఎంను కోరినట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు.
కాగా, నర్సాపూర్‌లో జరిగిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగిస్తూ.. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులకే మిత్తీలు కట్టలేక పోతున్నామనడంతో.. అక్కడే ఉన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, సభకు హాజరైన బీఆర్‌ఎస్ కార్యకర్తలు జై కేసీఆర్, జై బీఆర్‌ఎస్ అంటూ నినాదాలు చేశారు. వారికీ పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినదించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తం..
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. దౌల్తాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల పరిధిలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి సంబంధిత ఆఫీసర్లతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, సర్పంచ్‌లు బొక్కల నాగరాజు, పెరుమాండ్ల నర్సింలు, పీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేశ్, నాయకులు దుభాషి భాస్కర్ ఉన్నారు.

