
పులివెందుల: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వివేకానం ప్రధాన అనచరుడైన ఎర్ర గంగిరెడ్డి, పర్సనల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ నెల 15న ఉదయం స్నానాల గదిలో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని పడక గదికి తరలించినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు.
ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో తెలిపారు. 15న ఉదయం 5.30 గంటలకు తొలిసారి వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు వెల్లడించిన క్రమంలో అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో విచారించారు. స్నానాల గది నుంచి పడక గదికి తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి డెడ్ బాడీకి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ రక్తపు మరకలు కడిగాడని తెలిపారు. 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.