మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం

మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. " ఇండియాతో వ్యూహాత్మక  భాగస్వామ్య సంబంధాలకు మేం చాలా ప్రాధాన్యమిస్తాం. దేశాధినేతగా మీ నాయకత్వంలో రెండు దేశాల మధ్య రాజకీయ, ఉత్పాదక సహకారం మరింత వృద్ధి చెందుతుందని మేం విశ్వసిస్తున్నాం. పలు రంగాల్లో మన స్నేహపూర్వక దేశాల పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత కోసం మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం" అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

టీచర్ నుంచి రాష్ట్రపతి స్థాయికి.. 

జులై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము.. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఘన విజయం సాధించారు. దీనితో అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమెనే కావడం విశేషం. టీచర్ గా మొదలైన  ఆమె ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రపతి వరకు చేరుకుంది.