త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం.. మళ్లీ రష్యా అధ్యక్షుడిగా పుతిన్

త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం.. మళ్లీ రష్యా అధ్యక్షుడిగా పుతిన్
  • మూడో ప్రపంచ యుద్ధం..అడుగు దూరంలోనే..!
  • నాటో కూటమి, రష్యా తలపడితే థర్డ్ వరల్డ్ వారే..: పుతిన్
  • ఉక్రెయిన్​కు సాయం చేయడం ఆపేయాలని వార్నింగ్
  • పశ్చిమాది దేశాలకు హెచ్చరిక

మాస్కో :  అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి, రష్యా దళాలు నేరుగా తలపడితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఒక్క అడుగు దూరంలోనే మూడో ప్రపంచ యుద్ధం ఉందని హెచ్చరించారు. అయితే, దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మళ్లీ ఎన్నికైన నేపథ్యంలో.. ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో పశ్చిమాది దేశాలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

ఉక్రెయిన్​కు వెస్ట్రన్ కంట్రీస్​తో పాటు అమెరికా అండగా నిలవడంపై మండిపడ్డారు. ఉక్రెయిన్‌‌ యుద్ధం​లో అణ్వాయుధాల అవసరం కలగలేదన్నారు. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌‌లో నాటో సైనిక దళాలను మోహరించడాన్ని తాను తోసిపుచ్చలేనంటూ గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చేసిన కామెంట్లపై కూడా పుతిన్ స్పందించారు. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అన్నారు.

నాటో ఆర్మీ ఇప్పటికే ఉక్రెయిన్‌‌లో ఉందని తెలిపారు. పశ్చిమ దేశాలు రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నాయని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే నాటో ఆర్మీ పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నదన్నారు. రష్యా తన భూభాగాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌‌లో బఫర్ జోన్‌‌ను సృష్టించడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. రష్యా ఇప్పుడు మరింత శక్తివంతంగా తయారైందన్నారు. అమెరికా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం లేవని విమర్శించారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని పుతిన్​ ఎద్దేవా చేశారు.

2030  దాకా రష్యా అధ్యక్షుడిగా పుతిన్

పుతిన్ వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మార్చి 15, 17వ తేదీల్లో జరిగిన ఓటింగ్‌‌లో పుతిన్‌‌కు 88% ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థికి నికోలాయ్ ఖరిటోనోవ్‌‌కు 4% ఓట్లు పోలయ్యాయి. మిగిలిన ఇద్దరు ప్రత్యర్థులు వ్లాడిస్లావ్ దావన్కోవ్, లియోనిడ్ స్లట్స్కీ మూడు, నాల్గో స్థానాలకు పరిమితం అయ్యారు. పుతిన్ మొదటి సారిగా 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. తాజా విజయంతో మరో ఆరేండ్ల పాటు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కాగా, పుతిన్​కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండియా, రష్యాల మధ్య మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్ కూడా పుతిన్​కు అభినందనలు తెలిపారు.