మోదీకి విజయం దక్కాలి .. జై శంకర్​తో సమావేశంలో పుతిన్

మోదీకి విజయం దక్కాలి .. జై శంకర్​తో సమావేశంలో పుతిన్

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన ఫ్రెండ్ మోదీకి విజయం దక్కాలని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షించారు.  భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ  రష్యా– ఇండియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. మోదీని రష్యాలో పర్యటించాలని కోరారు.  భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఏడాది ఇండియాలో రాజకీయ వాతావరణం బిజీగా ఉంటుంది. మా స్నేహితుడు విజయం సాధించాలని నేను ఆశిస్తున్నాను. రష్యాలో పర్యటించాలని మోదీని కోరుతున్నాను.

 నా ఆహ్వానాన్ని ఆయనకు తెలియజేయండి. రష్యాలో మోదీ పర్యటిస్తే సమకాలీన అంశాలపై చర్చించవచ్చు”అని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలను అనేక సార్లు ప్రధాని మోదీకి వివరించానని పుతిన్ పేర్కొన్నారు. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి మోదీ శాయశక్తులా ప్రయత్నిస్తారనే విషయం తనకు తెలుసని వెల్లడించారు. 

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై  చర్చలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గందర గోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు పురోగమిస్తున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని వివరించారు. కాగా, జై శంకర్ ఐదు రోజుల  పర్యటనలో భాగంగా రష్యా వెళ్లారు. అందులో భాగంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్, మంత్రులు మంటురోవ్, లావ్రోలతో చర్చలు జరిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.