రైతుల గొంతుకలను అణగదొక్కుతున్నారు

రైతుల గొంతుకలను అణగదొక్కుతున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. పంజాబ్, హర్యానాతోపాలు ఢిల్లీలో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ బిల్లుల విషయంలో కేంద్ర తీరుపై కాంగ్రెస్, అకాలీదళ్‌‌తో పాటు పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రాహుల్ మండిపడ్డారు. రైతుల గొంతుకలను పార్లమెంట్ లోపల, వెలుపల అణగదొక్కుతున్నారని రాహుల్ సీరియస్ అయ్యారు.

‘వ్యవసాయ బిల్లులు మన రైతులకు మరణ శాసనాలుగా మారాయి. వారి గొంతుకలను పార్లమెంట్‌‌తోపాటు బయట కూడా అణగదొక్కుతున్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 20న వ్యవసాయ బిల్లులపై రాజ్య సభలో ఓటింగ్ పెడుతున్న సమయంలో రూల్స్‌‌ను విపక్ష సభ్యులు అతిక్రమించారనే మీడియా రిపోర్ట్‌‌కు స్పందనగా రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్‌‌కు ఓ పత్రికలో వ్యవసాయ బిల్లులపై చర్చ గురించి వచ్చిన ఆర్టికల్‌‌ను జత చేశారు.