ఓటు నమోదు ప్రక్రియ అందరి బాధ్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఓటు నమోదు ప్రక్రియ అందరి బాధ్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్/ కల్వకుర్తి, వెలుగు: ఓటు నమోదు ప్రక్రియ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా బీఎల్వో, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

పెంట్లవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇండ్ల వద్ద లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి ఓటు నమోదు చేయించాలని సూచించారు. పెంట్లవెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు పూరి గుడిసెల్లో ఉన్న నిజమైన లబ్ధిదారులను గుర్తించి పేర్లు పంపాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు కల్వకుర్తి పట్టణంలోని శ్రీ కృష్ణ కాలచత్రం క్షేత్రంలో నిర్వహించిన 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇలాంటి మహాయాగాలు సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. 

‘వనమంచు పల్లె’ పాటల పుస్తకావిష్కరణ 
కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో కల్వకోలు మద్దిలేటి రచించిన ‘వనమంచు పల్లె’ పాటల పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. పల్లెల జీవితాలు, ప్రకృతిని రక్షించే రచనలు, అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాటలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.