హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో అన్ని వసతులు కల్పించాక డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ప్రతి డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో స్కూల్, పార్కు, అంగన్ వాడీ, రేషన్ షాప్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 300 కోట్లతో నిర్మిస్తున్న సుమారు 4 వేల డబుల్ ఇండ్లను తనిఖీ చేశారు. బౌరంపేట, గాగిల్లాపూర్, దుండిగల్ ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీల్లో పర్యటించారు. అనంతరం గౌతమ్ మాట్లాడుతూ.. ప్రతి బ్లాక్ ను ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకుని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
డ్రైనేజీ, వాటర్ వర్క్స్, విద్యుత్ పనులను వెంటనే చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గాగిల్లాపూర్‌లోని 2ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. పునరావాస లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇచ్చి ఇండ్ల కేటాయింపు చేయాలన్నారు. అప్రోచ్ రోడ్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.
