వీఆర్వోలు, వీఆర్‌‌ఏలు రెవెన్యూ శాఖలోనే.!

వీఆర్వోలు, వీఆర్‌‌ఏలు రెవెన్యూ శాఖలోనే.!
  •     ఒక్కో తహసీల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్లుగా నలుగురైదురు వీఆర్వోలు
  •     వెయ్యి మందికి ఒక వీఆర్ఏ
  •     ప్రభుత్వానికి తహసీల్దార్ల ప్రతిపాదన.. మిగిలితేనే ఇతర శాఖల్లోకి

హైదరాబాద్, వెలుగు: వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే వేరే డిజిగ్నేషన్లతో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వీఆర్ఏలనూ ఇదే శాఖలో కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. భూ రికార్డుల నిర్వహణలో గ్రామ స్థాయిలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో 5,088 మంది వీఆర్వోలు హోదా కోల్పోయి ప్రభుత్వ ఉద్యోగులుగా మిగిలిపోయారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలోని ఖాళీలతో పాటు తహసీల్దార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండటంతో ఒక్కో ఆఫీసులో నలుగురు లేదా ఐదుగురు స్టాఫ్ అవసరం ఉంటుందని.. అందువల్ల డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వీఆర్వోలను ఈ ఆఫీసుల్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నివేదించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వమూ ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ సర్దుబాటు పూర్తయ్యాక మిగిలిన వాళ్లను మ్యాన్ పవర్ అవసరమున్న ఇతర శాఖల్లోకి పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

వెయ్యి మంది జనాభాకు ఓ వీఆర్‌‌ఏ!

కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న టైమ్‌‌లోనే వీఆర్‌‌ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మంది వీఆర్‌‌ఏలు పని చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో వీళ్లే ఎక్కువ. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామాల్లో ప్రొటోకాల్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో తహసీల్దార్లకు సాయంగా ఉండేందుకు.. ప్రకృతి వైపరీత్యాల టైమ్‌‌లో ప్రజలకు సాయం చేసేందుకు వీఆర్‌‌ఏల అవసరం తప్పనిసరిగా మారింది. ప్రతి ఊర్లో ఓ వీఆర్‌‌ఏను పెడతామని మండలిలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రాష్ట్రంలోని 12 ,769 పంచాయతీలకు ఒక్కొక్కరి చొప్పున 12 ,769 మందిని సర్దుబాటు చేస్తే మరో 10 వేల మంది మిగిలే అవకాశముంది. కానీ ఐదారు వేల జనాభా ఉన్న పెద్ద ఊర్లకు ముగ్గురు, నలుగురు వీఆర్ఏలు అవసరమవుతారని.. వెయ్యి మంది జనాభాకు ఒక వీఆర్‌‌ఏను నియమిస్తే వీఆర్‌‌ఏలను సర్దుబాటు చేయొచ్చని రెవెన్యూ సంఘాల నేతలు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాల ప్రతిపాదనకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.