మేరి కోమ్ బాటలో నడుస్తా-విరాట్ కోహ్లి

మేరి కోమ్ బాటలో నడుస్తా-విరాట్ కోహ్లి

మేరీ.. మీ దారిలో నడుస్తా.. 

ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌‌ లైఫ్‌‌ను  బ్యాలెన్స్‌‌ చేసుకుంటా: కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌‌, వరల్డ్‌‌ క్రికెట్‌‌ సూపర్‌‌ స్టార్​ విరాట్‌‌ కోహ్లీ ఎంతో మందికి ఆదర్శం. అతడి ఆట, లైఫ్‌‌స్టైల్‌‌ చూసి చాలా మంది యంగ్‌‌స్టర్స్‌‌ క్రికెట్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకుంటున్నారు. ఇండియాలోనే కాకుండా వరల్డ్‌‌వైడ్‌‌గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాడు విరాట్‌‌. అలాంటి వ్యక్తి తన ఆటతో సంబంధంలేని లెజెండరీ బాక్సర్‌‌ మేరీ కోమ్‌‌ను ఆదర్శంగా తీసుకుంటానని చెబుతున్నాడు.  తొందర్లోనే తండ్రి కాబోతున్న కోహ్లీ..  ఇకపై ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌‌ లైఫ్‌‌ను బ్యాలెన్స్‌‌ చేసుకుంటూ ముందుకెళ్లేందుకు మేరీ చూపిన బాటలో నడుస్తానని అంటున్నాడు.  నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా  ఆటలో రాణిస్తున్న మేరీ  మన దేశ మహిళలకే కాకుండా, అందరికీ స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు. పూమా ఇండియా ఏర్పాటు చేసిన ఇన్‌‌స్టాగ్రామ్‌‌ లైవ్‌‌ సెషన్‌‌లో లెజెండరీ బాక్సర్‌‌తో మాట్లాడిన విరాట్‌‌ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పేరెంట్‌‌ అయి ఉండి కూడా  కెరీర్‌‌లో ఇంత బిజీగా ఉన్నారు. ఈ విషయంలో మీకంటే బెటర్‌‌ పర్సన్‌‌ నాకెవ్వరూ కనిపించడం లేదు.  తల్లి అయిన తర్వాత కూడా ట్రెయినింగ్‌‌ కొనసాగిస్తున్నారు. ఎన్నో చాంపియన్‌‌షిప్స్‌‌ గెలిచారు. అవన్నీ మీకు ఎలా సాధ్యం అయ్యాయి?  పర్సనల్‌‌ లైఫ్‌‌, ప్రొఫెషనల్‌‌ కెరీర్‌‌ను ఎలా బ్యాలెన్స్‌‌ చేస్తున్నారు?’ అని మేరీని విరాట్‌‌ ప్రశ్నించాడు. తన ఫ్యామిలీ సపోర్ట్‌‌ వల్లే ముందుకెళ్తున్నానని కోమ్‌‌ చెప్పింది. ‘పెళ్లయినప్పటి నుంచి నా భర్తే  నా బలం. ఆయనిచ్చే మద్దతు అపారమైనది. నేను ఏది అడిగినా చేసి పెడతాడు. అతనో ఆదర్శవంతమైన భర్తే కాదు తండ్రి కూడా. అలాగే, నా పిల్లలు కూడా బంగారం’ అని స్టార్‌‌ బాక్సర్‌‌ చెప్పుకొచ్చింది. ‘ఈ దేశంలోని మహిళలకే కాదు అందరికీ మీరో ప్రేరణ. ఎన్నో అవాంతరాలు, అసమానతలు ఎదురైనా, సరైన సదుపాయాలు లేకపోయినా కూడా ఆటలో మీరెంతో సాధించారు. ఇప్పటికీ మీకంటూ ప్రత్యేక దారిని ఏర్పరుచుకొని ముందుకెళ్తున్నారు. మా అందరికీ ఆదర్శంగా నిలిచారు.  ఇప్పుడు మేం కూడా పేరెంట్స్‌‌ కాబోతున్నాం. మేం మిమ్మల్నే ఆదర్శంగా తీసుకుంటాం. మీరు వెళ్తున్న బాటలోనే నడుస్తాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.