క్షయ నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయాలి : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

క్షయ నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయాలి :  వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
  •     వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతీ రోగికి అవసరమైన సలహాలు, పోషకాహార సూచనలు అందించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్షయ వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రానికి నిత్యం ఎంతమంది రోగులు వస్తున్నారు, వారికి అందిస్తున్న వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగుల నమోదు, చికిత్స విధానం, ఫాలోఅప్ చర్యలు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్​ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా చేయాలన్నారు. 

కాగా, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే   కార్యక్రమం ద్వారా జిల్లా కేంద్రంలో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న 0 టు--18 ఏండ్ల లోపు పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఆయన  నిర్వహణ తీరును పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేసే చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. శిబిరంలో వైద్య పరీక్షల అనంతరం 18 మందిని సర్జరీకి రెఫర్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్​ఓ సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ పరిమళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.