
- పాక్‌తో వాంగ్‌చుక్‌కు ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడి
- ఆయన ఉద్యమ స్ఫూర్తిని చంపేసేందుకు కుట్రలు
- నిర్బంధంలో ఉన్న భర్తతో మాట్లాడే హక్కు లేదా? అని ప్రశ్న
న్యూ ఢిల్లీ: లఢక్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టుపై ఆయన భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాంగ్‌చుక్‌ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎస్‌ఏ) కింద నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని కోరారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనేడిమాండ్‌తో జరిగిన నిరసనల్లో నలుగురు మరణించగా, 90 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనికి కారకుడిగా ఆరోపిస్తూ.. లఢక్ ఉద్యమ నేత వాంగ్‌చుక్‌ను గత నెల 26న కఠినమైన ఎన్‌ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నారు
. కాగా, సీనియర్ లాయర్ వివేక్ తంఖా, లాయర్ సర్వం రితం ఖరే ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో వాంగ్‌చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు నమోదు చేయాలనే నిర్ణయాన్ని ఆంగ్మో ప్రశ్నించారు. తన భర్తను ఫోన్‌లో, వ్యక్తిగతంగా వెంటనే సంప్రదించడానికి అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.అంతకుముందు తన భర్తను విడుదల చేయాలని కోరుతూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు.
నా భర్తను కలవనివ్వట్లేదు
గత నెల 26న తన భర్తను అరెస్ట్‌చేశారని, అప్పటినుంచి తనను కలవనీయడం లేదని ఆంగ్మో ఆరోపించారు. నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసి, ఆయనతో మాట్లాడే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. ఈ కేసులో ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు తాను ఎందుకు సాయం చేయకూడదని అడిగారు. సోనమ్ వాంగ్‌చుక్‌కు పాక్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని చంపేసేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.