దవాఖానలో డాక్టర్లేరి? : కలెక్టర్ సత్యశారద

దవాఖానలో డాక్టర్లేరి? : కలెక్టర్ సత్యశారద

వర్ధన్నపేట, (ఐనవోలు)/ గ్రేటర్​ వరంగల్/ హసన్​పర్తి, వెలుగు: దవాఖానలో డాక్టర్లు ఎక్కడకు వెళ్లారని వరంగల్​ కలెక్టర్​ సత్యశారద ప్రశ్నించారు. బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని కలెక్టర్​ ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని బయోమెట్రిక్​ హాజరు వ్యవస్థను పరిశీలించారు. రిజిష్టర్లను తనిఖీ చేసి పలువురు వైద్యులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడంపై సూపరింటెండెంట్​ నర్సింహస్వామిపై అసహనం వ్యక్తం చేశారు.

వెంటనే గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ఆస్పత్రిలో వార్డులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, వెంటనే పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చాలని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నైట్​ డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీ పడబోమన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో కలెక్టర్, ఎమ్మెల్యే బస్సును ప్రారంభించారు.

ఈ బస్సు వరంగల్​ నుంచి కొండపర్తి వరకు సేవలు అందించనున్నట్లు వారు తెలిపారు.  ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రేటర్​ వరంగల్​ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఏర్పాటు చేయగా, కలెక్టర్​ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు హాజరై మాట్లాడారు. అనంతరం ఆస్పత్రిలో గర్భిణులకు అందుతున్న వైద్యం, ఆహారంపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హసన్​పర్తి మండలంలోని 1, 2, 55, 56, 65, 66 డివిజన్ల పరిధిలోని 76 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాగరాజు చెక్కులు పంపిణీ చేశారు.