ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కిసాన్ క్రిడిట్ కార్డులతో లోన్లు ఇయ్యాలె

వరంగల్‍, వెలుగు: కిసాన్ క్రిడిట్ కార్డులతో రైతులకు లోన్లు మంజూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుందర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు.  సిబిల్‍ స్కోర్‍ కారణాల వల్లే బ్యాంక్‍ లోన్లు పెండింగ్‍ ఉంటున్నాయని.. ఆఫీసర్లు వెంటనే వాటిని క్లియర్‍ చేయాలన్నారు. వరంగల్‍ కలెక్టర్‍ గోపి అధ్యక్షతన మంగళవారం జిల్లా కలెక్టరేట్‍లో సహకార సంఘం అభివృద్ధిపై డీసీసీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‍, ఎమ్మెల్యే పెద్ది పాల్గొన్నారు. బండ ప్రకాశ్‍ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి బ్యాంక్‍ కృషి చేయాలన్నారు. ఆర్‍బీఐ గైడ్ లైన్స్ పాటిస్తూ లోన్‍ టార్గెట్‍లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెద్ది మాట్లాడుతూ.. వ్యవసాయ భూమిలేని రైతులకు కిసాన్‍ క్రెడిట్‍ కార్డులను జాప్యం లేకుండా అందించడం ద్వారా సకాలంలో లోన్లు ఇవ్వాలన్నారు. కలెక్టర్‍ గోపి మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్‍ ద్వారా 246 మంది లబ్ధిదారులకు లోన్లు మంజూరు చేసి 59 మందికి గ్రౌండింగ్‍ పూర్తి చేసినట్లు చెప్పారు. పెండింగ్​లో ఉన్న 187 లోన్లను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని టార్గెట్‍ ఇచ్చారు.

టార్గెట్ మేర లోన్లు ఇవ్వాలి

జనగామ అర్బన్, వెలుగు: టార్గెట్ మేర రైతులకు లోన్లు ఇవ్వాలని జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య  బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ ఏడాది రూ.1459కోట్ల క్రాప్ లోన్లు లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ వరకు రూ.165 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఎంఎస్ఎం కింద రూ.290.15 కోట్లు లక్ష్యం కాగా ప్రస్తుతం రూ.36.17కోట్లు అందించామన్నారు. బ్యాంకర్లు పెండింగ్ లో ఉన్న యూనిట్లను పరిశీలించాలన్నారు.

బాధ్యతల నుంచి తొలగింపు

నర్సంపేట: నల్లబెల్లి, చెన్నరావుపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధక్ష బాధ్యతల నుంచి బానోతు సారంగపాణి, బాల్నే వెంకన్నను తొలగిస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి వెల్లడించారు. ఇరువురిపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధ్యతల నుంచి తప్పించామన్నారు. నల్లబెల్లి మండల పార్టీ కన్వీనర్​గా ఊడ్గుల ప్రవీణ్​గౌడ్, చెన్నారావుపేట మండల కన్వీనర్​గా కంది క్రిష్ణారెడ్డిలు నియమిస్తున్నట్లు వివరించారు.

ఆటోనగర్ ను అభివృద్ధి చేస్తా..

వరంగల్​సిటీ: వరంగల్ సిటీలోని ఆటోనగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. మంగళవారం కాలనీలో నిర్వహించిన ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. తన తండ్రి లారీ డ్రైవర్ గా పనిచేశారని, కార్మికుల కష్టాలు తనకు తెలుసన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 26 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నరేందర్ ను ఎన్నుకున్నారు.

మావోయిస్టుల వేటకు జాగిలాలు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పోలీస్​ యంత్రాంగం పర్యవేక్షణలో  సీఆర్పీఎఫ్ బలగాలు పలిమెల, మహదేవ్​పూర్, అడవిముత్తారం మండలాల్లోని అటవీ గ్రామాల్లో  పోలీసు జాగిలాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లిందని, వారు పల్లెల అభివృద్ధికి అడ్డంకిగా మారారని చెప్పారు. ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. పోలీస్ దోస్త్ కార్యక్రమంలో భాగంగా మహాదేవపూర్ లో వాలీబాల్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫస్ట్​ప్లేస్​లో నిలిచిన దమ్మూరు జట్టుకు రూ.10,000, సెకండ్​ప్లేస్​లో నిలిచిన అంబట్ పల్లి జట్టుకి రూ.5,000, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన బొడాయిగూడెం, ఎడపల్లి జట్లకు రూ.2,000 చొప్పున నగదు, క్రీడా సామగ్రిని ఎస్పీ అందచేశారు. 

ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం

నెక్కొండ, వెలుగు: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని వరంగల్ జిల్లా నెక్కొండ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సంగని సూరయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక బీజేపీ లీడర్ అజయ్ కుమార్ తన స్థాయి మరచి ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు టీఆర్ఎస్ లో పదవులు అనుభవించి, నేడు గత్యంతరం లేక బీజేపీలో చేరి ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, సర్పంచ్ హరికిషన్, లీడర్లు కొమ్ము రమేశ్, చెన్నకేశవరెడ్డి, సోమయ్య, నరేందర్​రెడ్డి, సారంగపాణీ, రవీందర్​రెడ్డి, శ్రీనీవాస్​, మాణీక్యం తదితరులున్నారు.

షూటింగ్ లు మాని ల్యాప్ టాప్ ల చోరీ
ముగ్గురి అరెస్ట్, 13 ల్యాప్ టాప్ లు స్వాధీనం

మహబూబాబాద్, వెలుగు: ల్యాప్ టాప్ లు దొంగతనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర వివరాల ప్రకారం.. మంగళవారం జిల్లాకేంద్రంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా.. చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రతాపని రాకేశ్, నల్గొండ జిల్లాకు చెందిన బొమ్మ శివరాజ్, కర్నూలు జిల్లాకు చెందిన బోయ విక్రమ్ నాయుడుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ లోని క్రిష్ణా నగర్ లో నివాసం ఉంటూ షూటింగ్​లకు వెళ్లేవారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో.. జిల్లా కేంద్రంలోని ఎస్వీ హైస్కూల్​లో కొద్దిరోజుల కింద 13 ల్యాప్ టాప్ లు చోరీ చేశారు. వీరిని అరెస్ట్ చేసి 13 ల్యాప్ ట్యాప్ లు, ఒక బైక్, 3 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

ఎంసీహెచ్ సేవలు భేష్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిని మంగళవారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి తనిఖీ చేశారు. హాస్పిటల్​లో సేవలు బాగున్నాయని కొనియాడారు. నార్మల్ డెలివరీలు పెరగడంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.సుగుణాకర్ రాజును ప్రశంసించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్​కు రెఫర్ చేయొద్దని సూచించారు. హాస్పిటల్​లో స్కానింగ్ కోసం మరో డాక్టర్ ను నియమిస్తామన్నారు. జిల్లా ఆసుపత్రికి జిడియాట్రిక్ కేర్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. టీ డయాగ్నస్టిక్ హబ్ ను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో  మొక్క నాటారు.

‘ఉక్కు ఫ్యాక్టరీపై భగ్గుమన్నరు’

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు నాణ్యత సరిగా లేదని, అక్కడ ఫ్యాక్టరీ పెట్టే ఆస్కారం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భగ్గుమన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోడీ, కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పే దాకా బీజీపీని వదిలేది లేదని స్పష్టం చేశారు. - వెలుగు నెట్ వర్క్

భూవివాదంలో ఒకరి హత్య

రఘునాథపల్లి, వెలుగు: భూముల కొట్లాట ఒకరి ప్రాణం తీసింది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగులకు చెందిన బొబ్బల రవి(36), కందగట్ల భాస్కర్ పక్కపక్కన రైతులు. రవికి చెందిన మూడెకరాల భూమిని ఇటీవల వేరేవాళ్లకు అమ్మాడు. ఈక్రమంలో మంగళవారం హద్దులు గుర్తించేందుకు కూలీలను తీసుకొచ్చాడు. పక్కనే ఉండే భాస్కర్ హద్దుల విషయంలో గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో భాస్కర్ గడ్డపారతో రవి తలపై మోదాడు. దీంతో స్పాట్​లో చనిపోయాడు. భయంతో భాస్కర్ పారిపోయాడు. ఏసీపీ రఘు చందర్, సీఐ సంతోష్, ఎస్ఐ రఘుపతి అక్కడికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ములుగులో మహాన్నదానం


ములుగు, వెలుగు: ములుగులోని రామాలయ ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత మంగళవారం బాల త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జంగిలి కోటేశ్వర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాన్నదానం కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ గెస్టుగా డీఎంహెచ్ వో డా.అల్లెం అప్పయ్య హాజరై, అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో అర్చకులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు బండారు మోహన్ కుమార్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మందల విజయ్ కుమార్ రెడ్డి, నగరపు రమేశ్, సీహెచ్.చిన్నకొండారెడ్డి, కురిమిళ్ల మహేందర్, ఎం.వెంకట్ రెడ్డి, బి.రాయపురెడ్డి, ఆర్.ఆనందాచారి, ఎ.ప్రశంత్ రెడ్డి, ఎం.వెంకట్ రెడ్డి, కె.శివాజీ, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

చిట్యాల, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామానికి చెందిన పంచిక అశోక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. బాధిత కుటుంబానికి మంగళవారం కావేరీ సీడ్ కంపెనీ మేనేజర్ సుమన్​రావు రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్​ పోలవేన పోశాలు, కంపెనీ ఉద్యోగులు తిరుపతిరావు, శ్రీధర్​రావు, కళాధర్ తదితరులున్నారు.

మావోయిస్టులకు సహకరించవద్దు

రేగొండ, వెలుగు: సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని రేగొండ ఎస్సై ఎన్. శ్రీకాంత్​రెడ్డి సూచించారు. మంగళవారం మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. ఫొటోల్లో ఉన్నవారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా.. ఫోన్ చేసి చెప్పాలన్నారు.

రామప్పలో హెరిటేజ్ వాక్

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: వరల్డ్ టూరిజం డే సందర్భంగా రామప్ప ఆలయంలో మంగళవారం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్​రావు, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ఫోరం చైర్మన్ వేద కుమార్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మెంబర్ ప్రొ.పాండురంగారావు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. అనంతరం స్టూడెంట్లు, వలంటీర్లు మూడు కిలోమీటర్ల పాటు హెరిటేజ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రావు మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.30కోట్లు సాంక్షన్ చేసిందన్నారు. రామప్ప, పాలంపేట అభివృద్ధికి మరో రూ.100కోట్లు ఇవ్వాలని సీఎంను కోరుతామన్నారు. కార్యక్రమంలో  టూరిజం ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, సీఐ రంజిత్ కుమార్, ఎస్సై తాజుద్దీన్, సర్పంచ్ డోలు రజిత తదితరులున్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు

మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట, మల్లారం గ్రామాల్లో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వల్లెంకుంట గ్రామంలోని ప్రసిద్ధ శ్రీత్రిశక్తి పీఠ దేవస్థానంలో ప్రధాన అర్చకులు గడ్డం సతీష్ భవాని స్వామీజీ ఆధ్వర్యంలో, మల్లారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవ దాతలు బెల్లంకొండ నితిన్ బాబు భానుప్రియ ఆధ్వర్యంలో  కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారం సర్పంచ్ గోనె పద్మ శ్రీనివాస రావు ఉన్నారు.

క్రీడల్లో రాణించాలి

రాయపర్తి, వెలుగు: స్టూడెంట్లు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంపీ పసునూరి దయాకర్ సూచించారు. వరంగల్ జిల్లా రాయపర్తి సోషల్ వెల్ఫేర్ స్కూల్​లో మంగళవారం జరిగిన 8వ జోనల్ స్థాయి క్రీడల ముగింపు ప్రోగ్రాంకు ఎంపీ హాజరై మాట్లాడారు. గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం పెడుతున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి సైతం పాటుపడుతుందన్నారు. ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు, సర్పంచ్ గారె నర్సయ్య ఉన్నారు.

అన్నారంలో కార్డన్ సెర్చ్

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో మామునూరు ఏసీపీ నరేశ్​కుమార్ మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని వెహికల్స్ ను సీజ్ చేశారు. స్థానిక ప్రజలకు, వ్యాపారులకు హెల్మెట్ వాడకంపై సూచనలు చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. పర్వతగిరి, మామునూర్​ సీఐలు  శ్రీనివాస్, క్రాంతి కుమార్, ఎస్సైలు దేవేందర్​, వెంకన్న పాల్గొన్నారు.

ఇయ్యాల ముల్కనూరు 66వ వార్షికోత్సవం

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలోని ప్రముఖ ముల్కనూరు డెయిరీ 66వ వార్షికోత్సవాన్ని నేడు నిర్వహించనున్నారు. ఈమేరకు బ్యాంక్ ఆవరణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ్యులందరికీ ఆహ్వానం పంపారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్గిరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి 1956లో 373 మంది రైతులతో దీనిని ప్రారంభించగా.. ప్రస్తుతం 7,604 మంది సభ్యులతో విజయవంతంగా సాగుతోంది. రైతులకు లోన్లు, ఎరువులు, మందులు, విత్తనాలు, పనిముట్లు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. సభ్యులు మరిణిస్తే ఆర్థిక సాయంతో పాటు పిల్లలకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయిస్తోంది. కంటి ఆపరేషన్లు, పింఛన్లు కూడా పంపిణీ చేస్తోంది.

అర్హులకే పింఛన్లు

చిట్యాల, వెలుగు: అర్హులకే కొత్త పింఛన్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్ పేట, కైలాపూర్, చిట్యాల, తిర్మలాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొత్త పింఛన్లతో పాటు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. అనర్హులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా పింఛన్ వదులుకోవాలని సూచించారు. పండుగకు ఇచ్చిన చీరలను అపహాస్యం చేయకూడదని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్​, పీఏసీఎస్​ చైర్మన్​ కుంభం క్రాంతికుమార్​రెడ్డి, సర్పంచ్​లు కామిడి రత్నాకర్​రెడ్డి, దామెరబోయిన నారాయణరావు, ఏలేటి సరోజన తదితరులు పాల్గొన్నారు.

మోడీ పథకాలను అమలు చేయట్లే!

ములుగు, వెలుగు: రాష్ట్రంలో మోడీ పథకాలను అమలు చేయకుండా కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి, రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ములుగు జిల్లాకేంద్రంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమ్మేళ కార్యక్రమం జరిగింది. చీఫ్ గెస్టుగా భాస్కర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

టీఆర్ఎస్ నేతలకు పనోళ్లలా పోలీసులు..

ఇతర పార్టీ లీడర్లు దిష్టిబొమ్మలను తగలబెడితే అరెస్ట్ చేసే పోలీసులు.. టీఆర్ఎస్ లీడర్లు దహనం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాడి రామరాజు నేత విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు పనోళ్లలా మారారని మండిపడ్డారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, ప్రధాన కార్యదర్శి పొదెం రవీందర్ ఉన్నారు.