ఓరుగల్లు గులాబీ లీడర్లకు..ఇంటోళ్ల పోరు

ఓరుగల్లు గులాబీ లీడర్లకు..ఇంటోళ్ల పోరు
  • కుటుంబ సభ్యుల మధ్య ఎమ్మెల్యే టిక్కెట్లు, ఆస్తుల లొల్లి
  • రెడ్యానాయక్‍, కడియంకు సవాల్ గా మారిన బిడ్డల టికెట్లు
  • ఆస్తుల విషయంలో ముత్తిరెడ్డిని బహిరంగంగా నిలదీస్తున్న బిడ్డ భవానీరెడ్డి
  • పశ్చిమలో వినయ్‍ భాస్కర్‍ వర్సెస్‍ అన్నకొడుకు అభినవ్‍ భాస్కర్‍
  •  నర్సంపేటలో షాడో ఎమ్మెల్యేగా మారిన పెద్ది సుదర్శన్‍రెడ్డి భార్య స్వప్న
  • బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్న గులాబీ లీడర్లు

వరంగల్‍, వెలుగు: ఈ సారి అసెంబ్లీ ఎన్నికల టికెట్ సాధించడం కష్టమేనని ఇప్పటికే టెన్షన్ లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇంటిపోరు మరింత తలనొప్పి  తెచ్చి పెడుతోంది. ఈ సారి తమకు టికెట్ ఇప్పించి గెలిపించాలని కూతుళ్లు, కొడుకులు  ఎమ్మెల్యేల వెంట పడుతుండగా మరికొన్ని చోట్ల ఆస్తుల విషయంలో బహిరంగంగానే నిలదీస్తున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో అయితే పదవుల కోసం బిడ్డలు, భార్యలే కాంపీటీటర్లుగా మారుతున్నారు. ప్రతిపక్షాల కంటే ఇంటోళ్ల పోరే ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు సగం మంది గులాబి ఎమ్మెల్యేలకు ఇదే టెన్షన్ పట్టుకుంది.

డోర్నకల్ టికెట్ రెడ్యాకా.. ఆయన బిడ్డకా ?

డోర్నకల్‍ ఎమ్మెల్యే రెడ్యానాయక్‍కు ఈ సారి తన టిక్కెట్‍తో పాటు బిడ్డ కోసం మరో టిక్కెట్‍ సంపాదించడం సవాల్‍గా మారింది. నిన్నమొన్నటి వరకు డోర్నకల్‍ స్థానాన్ని రెడ్యానాయక్ కుమారుడు రవిచంద్ర అడిగారు. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో తాను బరిలో ఉండడమే కరెక్ట్ అని కుమారుడిని బుజ్జగించాడు. అదే సమయంలో విపక్షాల కంటే సొంత పార్టీ నేతలే ఆయనకు శత్రువులయ్యారు. డోర్నకల్ స్థానం కోసం ఇప్పటికే గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‍ ఢీ అంటే ఢీ అంటోంది. ఇందులో భాగంగానే అక్కడక్కడ కొందరితో ఎమ్మెల్యేకు అడ్డంకులు సృష్టిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మహబూబాబాద్‍ ఎంపీ మాలోతు కవిత ఈ సారి ఎమ్మెల్యే అవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మహబూబాబాద్‍ సిట్టింగ్‍ ఎమ్మెల్యే శంకర్‍ నాయక్‍ సీటు కోసం తండ్రితో కలిసి ప్రయత్నిస్తున్నారు. దీంతో రెండు స్థానాలు ఇస్తారో లేదోనన్న ఆందోళన ఆయనలో నెలకొంది. మంత్రిని, సిట్టింగ్‍ ఎమ్మెల్యేను కాదని ఒకే ఇంట్లో రెండు టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఒక్కటే టిక్కెట్‍ ఇస్తే బిడ్డ రూపంలో ఆయన పదవికి ఎసరు వచ్చేలా ఉంది.

కడియంకు సవాల్​గా బిడ్డ రాజకీయ భవిష్యత్

సీనియర్‍ లీడర్‍ అయిన కడియం శ్రీహరికి కూడా టిక్కెట్‍ టెన్షన్‍ తప్పడం లేదు. ఈయనకు కుమారులు లేకపోవడంతో వారసురాలిగా కూతురు డాక్టర్‍ కడియం కావ్య పొలిటికల్‍ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.  టిక్కెట్‍ కోసం తండ్రినే నమ్ముకుంటూ అనేక సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. ఈ సారైనా టిక్కెట్‍ దక్కించుకునేందుకు ఆరాటపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియం గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన స్టేషన్‍ ఘన్‍పూర్‍ టిక్కెట్‍ విషయంలో సిట్టింగ్‍ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో తన బిడ్డకు టిక్కెట్‍ తెచ్చుకోవడం శ్రీహరికి పెద్ద టాస్క్ గా మారింది. ఎస్సీ రిజర్వేషన్‍ కావడంతో స్టేషన్‍ ఘన్‍పూర్‍, వర్ధన్నపేట నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. తన టికెట్ కే పోటీ తప్పని పరిస్థితి నెలకొనడంతో ఇప్పుడు రెండు టికెట్లు సాధించడం కష్టంగా మారింది. దీంతో బిడ్డ రాజకీయ భవిష్యత్‍ కడియంకు సవాల్‍గా మారింది. 

పశ్చిమలో బాబాయ్‍ వర్సెస్‍ అబ్బాయ్‍

వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍కు ఆయన అన్న, మాజీ మంత్రి ప్రణయ్‍ భాస్కర్‍ పొలిటికల్‍ లైఫ్‍ ఇచ్చారు. ప్రణయ్ భాస్కర్ ఎన్‍టీఆర్‍ గవర్నమెంట్‍లో యువజన, క్రీడలు శాఖ మంత్రిగా చిన్న వయస్సులోనే ఓ వెలుగు వెలిగారు. అనారోగ్యం కారణంగా ప్రణయ్‍ చనిపోగా ఆయన భార్య సబిత రాజకీయాల్లోకి వచ్చారు. అయినా ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తర్వాత తన అన్నపేరుతో వినయ్‍ భాస్కర్‍ రాజకీయాల్లోకి వచ్చి తన ప్రస్థానం సాగిస్తున్నారు. అయితే రాజకీయ భవిష్యత్‍ ఇచ్చిన ప్రణయ్‍ భాస్కర్‍ కుటుంబంతో ప్రస్తుతం వినయ్‍ భాస్కర్‍కు పడడం లేదు. ఇరు కుటుంబాల మధ్య పొలిటికల్‍, ప్రాపర్టీ వార్‍ నడుస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గరి బంధువులు సైతం రెండుగా విడిపోయారు. ఇదే టైంలో ప్రణయ్‍ కుమారుడు అభినవ్‍ భాస్కర్‍ పొలిటికల్‍ ఎంట్రీ ఇచ్చాడు. గ్రేటర్‍ వరంగల్‍ 60వ డివిజన్‍ కార్పొరేటర్‍గా వ్యవహరిస్తున్న అభినవ్‍ భాస్కర్‍ రాజకీయాల్లో తన బాబాయ్‍ వినయ్‍ భాస్కర్‍ పేరు చెప్పుకోడానికి ఇష్టపడడం లేదు. ప్రొగ్రాంలు చేసే క్రమంలో సిటీలో వందలాది ఫ్లెక్సీలు కట్టినా అందులో తన బాబాయ్  ఫొటో పెట్టడం లేదు. లోకల్‍ ఎమ్మెల్యే అయిన వినయ్‍ భాస్కర్‍ను ఏ కార్యక్రమానికి పిలువడం లేదు. సొంతంగా యూత్‍లో ఫాలోయింగ్‍ సంపాదించుకుంటున్నారు. ఏదేమైనా వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే అవ్వాలని అభినవ్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్‍ అబ్బాయ్‍ మధ్య కోల్డ్ వార్‍ నడుస్తోంది.

ముత్తిరెడ్డిని బయట తిరగనియ్యని కూతురు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన కూతురు తుల్జా భవానిరెడ్డి మొస మర్రనీయడం లేదు. తెలంగాణ సెంటిమెంట్ పోయి ఇప్పటికే ప్రతిపక్షాలు స్ట్రాంగ్‍ అయ్యాయి. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి తీరుతో కొంత ఇబ్బంది పడగా.. ఇప్పుడు బిడ్డనే శత్రువుగా మారింది. ఆస్తులు, కోర్ట్ గొడవలు, నిర్మాణాల తొలగింపు, పోలీస్‍ కేసులు, ప్రెస్‍మీట్లతో తండ్రితో ఫైట్‍ చేస్తోంది. నియోజకవర్గంలో తిరిగినప్పుడు సమస్యలపై జనాలు ప్రశ్నిస్తే ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకునే ముత్తిరెడ్డికి.. ఇప్పుడు బిడ్డ ఎప్పుడు, ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో కూడా అర్థం కావడం లేదు. మీడియా, ఓటర్ల ముందే ఆమె తండ్రిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో ముత్తిరెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేర్యాల స్థల వివాదంలో ఆమె విపక్షాలతో కలిసి ప్రహారీ కూల్చడం, ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి రాసిస్తున్నానని చెప్పిన నేపథ్యంలో కేసులకు రాజకీయ రంగు పులుముకుంది. ఇష్యూస్‍ అన్నీ బిడ్డతోనే ఉండడంతో ఆయన ఏం చేయలేకపోతున్నారు.

పెద్ది స్వప్న.. షాడో ఎమ్మెల్యే

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న ఆయనతో పాటు సమాంతర రాజకీయాలు నడిపిస్తున్నారు. ఉద్యమ సమయంలో ప్రేమ ఇరువురిని ఒక్కటి చేసింది. స్వప్న సైతం రాజకీయాల్లో రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ది తన సొంతూరు నల్లబెల్లి మండలం నుంచి ఆమెను జడ్పీటీసీగా గెలిపించాడు. మొదటి అడుగులోనే ఆమె జడ్పీ చైర్‍పర్సన్‍ పదవి ఆశించినా దక్కలేదు. ప్రస్తుతం ఆమె బీఆర్‍ఎస్‍ వరంగల్‍ జడ్పీ ఫ్లోర్‍ లీడర్‍గా వ్యవహరిస్తున్నారు. కాగా నియోజకవర్గంలో స్వప్నను షాడో ఎమ్మెల్యేగా భావిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్లు ఎమ్మేల్యే సుదర్శన్ రెడ్డితో పాటు, స్వప్నను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఆమె స్వయంగా హైకమాండ్‍ పెద్దలకు దగ్గరయ్యేలా అడుగులు వేస్తున్నారు. అవకాశం వస్తే పెద్ది స్థానంలో తానే పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.