హోటల్ లో షార్ట్ సర్క్యూట్.. భర్త మృతి, భార్యకు గాయాలు..హనుమకొండ పట్టణంలో ఘటన

హోటల్ లో షార్ట్ సర్క్యూట్.. భర్త మృతి, భార్యకు గాయాలు..హనుమకొండ పట్టణంలో ఘటన
  • 'ఫుడ్ వేస్ట్ చేస్తే ఫైన్' వేసే హోటల్ గా ప్రాచుర్యం
  • తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఫ్రీగా చాయ్ 
  • టిఫిన్ పంచిన  కేదారి, పుష్ప దంపతులు

హనుమకొండ, వెలుగు : 'ఫుడ్ వేస్టే చేస్తే ఫైన్' వేసే హోటల్ గా పేరుగాంచిన హనుమకొండ అదాలత్ జంక్షన్ లోని లింగాల కేదారి ఫుడ్ కోర్టులో  బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో కేదారి చనిపోగా, ఆయన భార్య పుష్ప తీవ్ర గాయాలయ్యాయి. 

వివరాల్లోకి వెళ్తే... హనుమకొండలోని బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన లింగాల కేదారి, -పుష్ప దంపతులు అదాలత్ జంక్షన్ లో సుమారు 40 ఏండ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు 'లింగాల కేదారి హోటల్' పేరున  ఆయన సుపరిచితుడు. రోజువారీలాగే బుధవారం కూడా హోటల్ నిర్వహిస్తుండగా.. రాత్రి 8.30 గంటల టైంలో హోటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

అదాలత్ జంక్షన్ వద్ద డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు మంటలను గమనించి హోటల్ లో ఉన్న కేదారి, పుష్ప దంపతులను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డి ఇద్దరిని బయటకు తీసి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడ కేదారి చనిపోగా, 65 శాతం కాలిన గాయాలతో పుష్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 

తెలంగాణ ఉద్యమంలో ఫ్రీగా ఛాయ్, టిఫిన్

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మందికి ఫ్రీగా ఆకలి తీర్చిన పేరు లింగాల కేదారికి ఉంది. హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులకు ఫ్రీగానే ఛాయ్, టిఫిన్ పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆహారాన్ని వృథా చేయొద్దనే సంకల్పంతో ఈ హోటల్ ను ప్రారంభించిన కేదారి.. ఎవరైనా వృథా చేస్తే ఫైన్ కూడా విధించేవారు. ఇలా లింగాల కేదారి హోటల్ ఫేమస్ అయింది. లింగాల కేదారికి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. సుమారు రెండేండ్ల కింద మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ ముచ్చటించడం విశేషం.