13 నుంచి ఐలోని జాతర

13 నుంచి ఐలోని జాతర

వరంగల్, వెలుగు: వరంగల్​అర్బన్​ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి విశిష్ట ప్రాశస్త్యం ఉంది. అందుకే మొక్కులు తీర్చుకుని, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఏటా సంక్రాంతి సమయంలో స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవి ఈ నెల 13 నుంచి ఉగాది వరకు కొనసాగనున్నాయి. ఇక్కడికి రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే ముందస్తుగా సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం వెళ్లే భక్తులు సంక్రాంతి సమయంలో స్వామివారికి మొక్కులు పెట్టేందుకు వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే 13 నుంచి సంక్రాంతి, కనుమ రోజుల్లోనే కనీసం 10 లక్షల మంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

రూ.2 కోట్లతో కొనసాగుతున్న పనులు

ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో డిసెంబర్​15న దాదాపు రూ.5.56 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బ్రహ్మోత్సవాలలోగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ(కుడా) ఆధ్వర్యంలో ఆలయానికి ఎంట్రన్స్, ఎగ్జిట్​లో రెండు ఆర్చీలు, ఆయా మార్గాల్లో డివైడర్, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేస్తున్నారు. ఆయా పనులకు దాదాపు రూ.2 కోట్ల వరకు కేటాయించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా మరికొన్ని పనులను వాయిదా వేశారు. భక్తుల రద్దీ పూర్తి కాగానే దాతల సహకారం, మిగిలిన నిధులతో దేవస్థాన ఈవో ఆఫీస్, ఒకేసారి 500 మంది భోజనం చేసేలా నిత్యాన్నదాన సత్రం నిర్మించనున్నారు. అంతేకాకుండా ఇక్కడికి  వచ్చే భక్తులకు గదుల సౌకర్యం కల్పించేలా ‘మల్లన్న సదన్’ పనులను కూడా ప్రారంభించనున్నారు. 45 గదులుండే ఈ సత్రానికి లిఫ్ట్​ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

60 బస్సులతో ఆర్టీసీ సేవలు

ఐనవోలు వరంగల్​నుంచి 16 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అంతేగాకుండా సంక్రాంతి సమయంలో రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐనవోలు మీదుగా జనగామ, మహబూబాబాద్​, హైదరాబాద్​, కొమురవెల్లి తదితర ప్రాంతాలకు దాదాపు 60 బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులకు దేవస్థానం తరఫున లేఖ కూడా అందించారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా..

ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇప్పటికే చలువ పందిళ్లు వేశారు. ఆలయం చుట్టూ సెంట్రల్​ లైటింగ్​సిస్టంతోపాటు రద్దీ వల్ల ఇబ్బందులు కలగకుండా బారికేడ్లతో వరుసలు కూడా ఏర్పాటు చేశారు. తాగునీటికి ఇక్కట్లు రాకుండా ఉండేందుకు ముందస్తుగా మిషన్​ భగీరథ నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తుల భద్రత, నిఘా దృష్ట్యా ఆలయంలో ఇదివరకే 30 వరకు సీసీ కెమెరాలు అమర్చారు. జాతర జరిగే రోజుల్లో మరింత నిఘా పెంచేందుకు మరో 50 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయంలో శానిటేషన్​, వైద్య సేవలు కీలకం. దీంతో గ్రామ పరిధిలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో 24 గంటలపాటు  సేవలందించేందుకు సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా జీడబ్ల్యూఎంసీ నుంచి అదనంగా 45 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షిస్తున్నారు. వీరు మూడు బ్యాచ్​లుగా సేవలందించనున్నారు.