నిత్య వివాదాల్లో వరంగల్‍ కాకతీయ మెడికల్‍ కాలేజీ

నిత్య వివాదాల్లో వరంగల్‍ కాకతీయ మెడికల్‍ కాలేజీ
  • ప్రధానికి ట్వీట్​ చేయడంతో కేఎంసీ ఆఫీసర్లలో కదలిక
  • మొదట్లో కప్పిపుచ్చే ప్రయత్నాలు.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంక్వైరీ
  • సీనియర్లు, జూనియర్ల మధ్య గొడవ నిజమే అని తేల్చిన కమిటీ

వరంగల్, వెలుగు: వరంగల్‍ కాకతీయ మెడికల్‍ కాలేజీ కొన్ని నెలలుగా సరికొత్త వివాదాలకు కేరాఫ్‍ అవుతోంది. సీనియర్లు ర్యాగింగ్‍ చేస్తున్నారని పలుమార్లు జూనియర్లు అంటుంటే.. అబ్బే క్యాంపస్‍లో అలాంటిదేం లేదని అధికారులు ప్రతిసారి చెప్పుకొస్తున్నారు. ఈసారి మాత్రం ర్యాగింగ్‍పై ఓ స్టూడెంట్‍ చేసిన ట్వీట్​తో టాపిక్‍ కాస్తా వరంగల్‍ దాటి ఢిల్లీ వరకు చేరింది. ప్రధాని మోడీ, అమిత్‍షా, కేటీఆర్‍, తెలంగాణ డీజీపీతో పాటు మరో ముగ్గురికి ట్యాగ్‍ చేయడంతో ఇష్యూ సీరియస్ ​అయింది. దీంతో ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు అది ర్యాగింగ్​కాదని, కేవలం గొడవ మాత్రమే అంటూ 24 మంది సీనియర్లపై సీరియస్​ యాక్షన్‍ తీసుకున్నారు. 

ట్విట్టర్‍ పోస్టింగ్‍తో క్యాంపస్‍లో ఎంక్వైరీ
కాకతీయ మెడికల్‍ కాలేజీలో ఇటీవల ఓ స్టూడెంట్‍ బర్త్ డే జరిగింది. ఇందులో జూనియర్లు, సీనియర్లు పాల్గొన్నారు. రెస్పెక్ట్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 13వ తేదీ రాత్రి ఈ ఘటన జరగగా.. అదేరోజు అర్ధరాత్రి 1.41 గంటలకు ట్విట్టర్‍ వేదికగా ‘రెడ్డి’ అనే అకౌంట్‍ ద్వారా ఓ వ్యక్తి ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు పోస్ట్​ చేశాడు. తమను 2017 బ్యాచ్‍కు చెందిన 50 మంది సీనియర్లు తాగొచ్చి ర్యాగింగ్‍ చేస్తున్నారని రాశాడు. తాము కేఎంసీలోని న్యూ మెన్స్ హాస్టల్‍ 01లో ఉన్నామని,  అర్జంట్ గా వచ్చి కాపాడాలని రెక్వెస్ట్​ చేశాడు. విషయం కాస్త సోషల్‍ మీడియాలో వైరల్ అయింది. దీంతో డైరెక్టర్‍ ఆఫ్‍ మెడికల్‍ ఎడ్యుకేషన్‍ డాక్టర్‍ రమేశ్‍రెడ్డి వరంగల్‍ సీపీ డాక్టర్‍ తరుణ్‍జోషి ఈ అంశమై ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. కాగా, అప్పటికే సదరు స్టూడెంట్​తానుపెట్టిన పోస్ట్​ను ట్విట్టర్‍ ఖాతా నుంచి డిలీట్‍ చేశాడు.  ఈ క్రమంలో కేఎంసీ అధికారులు సీనియర్‍ ప్రొఫెసర్లు డాక్టర్లు కుమార్‍రెడ్డి, గిరిధర్‍, విజయ్‍కుమార్‍, రాజారాంతో పాటు మొత్తం 8 మందితో సోమవారం విచారణ కమిటీ వేశారు.

24 మంది స్టూడెంట్లపై డిసిప్లినరీ యాక్షన్‍ 
కేఎంసీ ర్యాగింగ్‍ ఘటనపై ప్రొఫెసర్ల బృందం విచారణ జరిపి రిపోర్ట్ అందించింది. 2018 బ్యాచ్‌ స్టూడెంట్లు ఫ్రెషర్స్‌ డేకు ముందు బర్త్ డే సెలబ్రెషన్‍ చేసుకునే క్రమంలో 2017 బ్యాచ్‌ విద్యార్థులు వారిని పిలవకపోవడంపై ప్రశ్నించారు. అదికాస్తా ఘర్షణగా మారి 2016, 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన  సుమారు 40 మందికి పైగా స్టూడెంట్ల మధ్య గొడవ జరిగినట్లు గుర్తించారు. అది గొడవ తప్పించి ర్యాగింగ్‌ కాదని చెబుతూనే కాలేజీ రూల్స్​కు విరుద్ధంగా ప్రవర్తించారని రిపోర్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు, కాలేజీ ప్రిన్సిపల్‍ డాక్టర్‍ మోహన్‍దాస్‍ ఆదేశానుసారం ఐదుగురు స్టూడెంట్లను హాస్టల్‍ నుంచి పూర్తిగా బహిష్కరించారు. మరో 19 మందిని 4 వారాల పాటు క్లాసులు, హాస్టల్‍ కు రాకుండా డిసిప్లినరీ యాక్షన్‍ కింద సస్పెండ్‍ చేశారు.

తరచూ ర్యాగింగ్‍.. ఘర్షణలు 
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఉస్మానియా తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీకి మంచి  పేరుంది. ఇక్కడ చదువుకున్న డాక్టర్లకు మనదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. వారంతా కేఎంసీ స్టూడెంట్స్​గా గర్వపడతారు. కాగా, గత కొన్ని నెలలుగా ర్యాగింగ్‍ ఆరోపణలు, ఘర్షణలు, ఇతర వివాదాలతో కాలేజీ పేరు చర్చనీయాంశమవుతోంది. ఏడాది కింద మెడికల్‌ పీజీ పరీక్షల సందర్భంగా హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ బయటకు రావడం కలకలం రేపింది. లాక్ డౌన్ తర్వాత క్లాసులు స్టార్ట్ అయిన కొన్ని రోజులకు ర్యాగింగ్ అంశం బయటకొచ్చింది. రెండు నెలల కింద జూనియర్ స్టూడెంట్.. ముగ్గురు సీనియర్ స్టూడెంట్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. బాధిత స్టూడెంట్‍ పేరేంట్స్ విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఫుట్ బాల్ ఆడే క్రమంలో జూనియర్, సీనియర్స్ మధ్య గొడవగా తేల్చారు. ఆ  తర్వాత రెస్పెక్ట్ విషయంలో ఒక జూనియర్ స్టూడెంట్.. ముగ్గురు సీనియర్ల మధ్య ఘటన జరగగా ఆఫీసర్లు రెండు వర్గాలతో క్షమాపణ చెప్పించి సద్దుమణిగేలా చూశారు. లెటెస్ట్ గా ర్యాగింగ్‍ పేరుతో ప్రధాని మోడీకి ట్విట్టర్‍ పోస్టింగ్‍.. ఎంక్వైరీ.. సస్పెన్షన్‍ వరకు వచ్చింది. 

‘రెడ్డి’ ట్వీట్‍ వల్లే విషయం వెలుగులోకి..
కాకతీయ మెడికల్ కాలేజీలో ఆడపాదడపా ర్యాగింగ్‍, కొట్లాటలు జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం ఎప్పటికప్పుడు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కేఎంసీకి ఉన్న మంచిపేరు బద్నాం అవకుండా చేశారనుకోవచ్చు. కానీ అదే టైంలో  ర్యాగింగ్‍కు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారనే విమర్శ ఉంది. ర్యాగింగ్‍ విషయమై ఫిర్యాదు చేస్తే తమ భవిష్యత్‍ ఏమవుతుందోననే భయంతో చాలామంది జూనియర్‍ స్టూడెంట్లు లోలోపలే కుమిలిపోతున్నారనేది సిబ్బందికి కూడా తెలుసు. అధికారులు చెప్పినట్లు.. నాలుగు రోజుల క్రితం జూనియర్లు, సీనియర్ల మధ్య కేవలం ఘర్షణ మాత్రమే అయిందనుకున్నా దానిని సైతం కప్పిపుచ్చారు. 40 మంది స్టూడెంట్లు ఒకేచోట గొడవపడ్డా.. కేఎంసీలో ఎటువంటి ఇష్యూ జరగలేదని ఎవరో గిట్టని వ్యక్తులు ట్విట్టర్‍లో అలా పెట్టారని ఆఫీసర్లు సర్టిఫికెట్‍ ఇచ్చారు. తీరా విషయం సీరియస్‍ అయ్యాక ఎంక్వైరీ చేస్తే అధికారులు ఘర్షణగా చెబుతున్న ర్యాగింగ్‍ అనవాళ్లు బయటి ప్రపంచానికి తెలిశాయి. ఏదేమైనా ‘రెడ్డి’ ట్వీట్‍తో అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకునేలా మేలు జరిగిందని బాధిత తల్లిదండ్రులు భావిస్తున్నారు.