హాస్టల్​లో ఫుడ్​ పాయిజనింగ్.. 52 మందికి సుస్తీ

హాస్టల్​లో ఫుడ్​ పాయిజనింగ్.. 52 మందికి సుస్తీ

ముప్పారం కస్తూర్బా హాస్టల్​లో ఘటన

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్​ అర్బన్​జిల్లా ధర్మసాగర్​ మండలం ముప్పారంలోని కస్తూర్బా హాస్టల్​లో ఫుడ్​ పాయిజనింగ్​తో 52 మంది స్టూడెంట్లు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్​మెంట్​ కోసం వారిని శుక్రవారం ఉదయం  ధర్మసాగర్​ పీహెచ్ సీకి అక్కడి నుంచి ఎంజీఎం హాస్పిటల్​కు తరలించారు. స్టూడెంట్లు తెలిపిన వివరాల ప్రకారం… ముప్పారం హాస్టల్ లో 250 మంది చదువుతున్నారు. రోజులాగే గురువారం సాయంత్రం భోజనాలు చేసి పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వారిలో కొందరికి కడుపునొప్పి రావడం, వాంతులు, విరేచనాలు కావడంతో విషయాన్ని  వార్డెన్​ స్వాతికి తెలిపారు. ఆమె డాక్టర్​కు సమాచారం అందించింది. పొద్దున్నే డాక్టర్​ వచ్చి స్టూడెంట్లకు పరీక్షలు నిర్వహించి ఫుడ్​పాయిజన్​అయినట్లుగా గుర్తించారు. వెంటనే  33 మందిని 108లో ఎంజీఎంకు తరలించారు. 16 మందిని ధర్మసాగర్​ పీహెచ్ సీలో చేర్చారు. వారిలో 12 మంది స్టూడెంట్ల పరిస్థితి బాగాలేకపోవడంతో వారిని కూడా ఎంజీఎంకు తరలించారు. ముగ్గురు స్టూడెంట్లకు హాస్టల్​లోనే ట్రీట్ మెంట్​ ఇచ్చారు. విషయం తెలియడంతో జేసీ దయానంద్, ఆర్ఎంవో హరీశ్​రాజ్, డీఎంహెచ్ వో  లలితాదేవి హాస్పిటల్​కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య ఎంజీఎంకు వచ్చి స్టూడెంట్లకు పరీక్షలు నిర్వహించారు. గురువారం స్టూడెంట్లు తిన్న భోజనాన్ని టెస్టుకు పంపించారు.