వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం.. వైద్యం వికటించి రాములు మృతి

వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం.. వైద్యం వికటించి రాములు మృతి

వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించి కాసు రాములు అనే వ్యక్తి చనిపోయాడు. మే 13వ తేదీన మధ్యాహ్నం రాములుకు నర్సు మూడు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు అతని కొడుకు అనిల్ చెప్పాడు. ఈ మూడు ఇంజెక్షన్లు ఇచ్చిన 20 సెకన్లలోపే రాములు చనిపోయినట్లు ఆరోపిస్తున్నాడు. రాములు మృతితో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యం అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాతే..

మే 12వ తేదీన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన కాసు రాములు వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాడు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాలుకు మల్టీ ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు చెప్పినట్లు రాములు కొడుకు అనిల్ తెలిపాడు. రాడ్ వేస్తామని చెప్పినట్లు వెల్లడించాడు. 13వ తేదీన పొద్దున టిఫిన్ కూడా బాగానే తిన్నాడని..యాక్టీవ్ గా ఉన్నాడని తెలిపాడు. కానీ మధ్యాహ్నం 1: 30 నిమిషాలకు వచ్చిన నర్సు మూడు ఇంజెక్షన్లు ఇచ్చిన  20 సెకన్లలోపే చనిపోయాడని... నోట్లో నుంచి నురగ వచ్చి కిందపడిపోయినట్లు చెప్పాడు. నాన్న రాములు అలా ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో మంది రోగులు ఇబ్బందిపడుతున్నారు. మే 12వ తేదీ కూడా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలికి నెల రోజుల కిందట ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి అరికాలు తొలగించారు. ఆ తరువాత పేషెంట్ ను మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి చెకప్ చేయించుకొని వెళ్లాలని సూచించారు. దీంతో మే12వ తేదీ భర్త.. భార్యను ఆసుపత్రికి ఆటోలో తీసుకు వచ్చాడు.అయితే  నడవలేని స్థితిలో ఉన్న రోగికి స్ట్రెచర్ కావాలని ఆసుపత్రి సిబ్బందిని అడిగినా ఇవ్వలేదు. దీంతో భార్యను వీపు పైకి ఎక్కించుకొని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.