వరంగల్ అమ్మాయికి  సివిల్స్ 20వ ర్యాంక్

వరంగల్ అమ్మాయికి  సివిల్స్ 20వ ర్యాంక్

న్యూఢిల్లీ/హైదరాబాద్/ఎర్రుపాలెం, వెలుగు: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2020 ఫైనల్ రిజల్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. మరో 150 మందిని రిజర్వ్ లిస్టులో ఉంచినట్లు తెలిపింది. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజ ఆలిండియా 20వ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 120 మంది దాకా యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయితే.. వారిలో 60 మంది వరకూ తుదిజాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. టాప్​100లో 11 మంది తెలుగు వాళ్లే ఉన్నారు.

సమాజ సేవ చేసేందుకే: శ్రీజ

శ్రీజది వరంగల్ జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్​లోనే స్థిరపడ్డారు. తండ్రి శ్రీనివాస్ సేల్స్ మేనేజర్ కాగా, తల్లి లక్ష్మి నర్సుగా పని చేస్తున్నారు. శ్రీజ చదువంతా హైద‌‌రాబాద్‌‌లోనే సాగింది. 2019లో ఉస్మానియా కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. సమాజానికి సేవ చేసేందుకు సివిల్స్ ను ఎంచుకున్నట్టు శ్రీజ చెప్పారు.

సర్పంచ్ కొడుకు సివిల్స్​కు ఎంపికైండు

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోట కిరణ్ కుమార్.. సివిల్స్ లో 652 ర్యాంక్ సాధించారు. కిరణ్ తల్లి కోట వజ్రమ్మ ఆ గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. వజ్రమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కోట బాబురావు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో సీఐగా పనిచేస్తున్నారు. కిరణ్ కుమార్ 1వ తరగతి నుండి 4 వతరగతి వరకు భీమవరం స్కూల్లో, 5 నుండి పదవ తరగతి వరకు దమ్మపేట గురుకుల పాఠశాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నాగోల్ గురుకుల కళాశాలలో, బీటెక్ ఐఐటీ ఖరగ్​పూర్ లో చదివి సివిల్స్‌‌కు ప్రిపేర్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తొలి ప్రయత్నంలోనే..

వనపర్తి జిల్లా కొత్తకోటలోని కడుకుంట్లకు చెందిన పృథ్వి రాజ్ గౌడ్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ 541వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

761 మంది ఎంపిక.. 

సివిల్స్‌‌కు 761 మంది ఎంపికయ్యారు. వీళ్లలో 263 మంది జనరల్, 86 మంది ఈడబ్ల్యూఎస్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 545 మంది మగవాళ్లు కాగా, 216 మంది ఆడవాళ్లు. రిజర్వ్ లిస్టులో 75 మంది జనరల్, 15 మంది ఈడబ్ల్యూఎస్, 55 మంది ఓబీసీ, ఐదుగురు ఎస్సీ, ఒక్కరు ఎస్టీ కేటగిరీ అభ్యర్థి ఉన్నారు. బీహార్ కు చెందిన శుభం కుమార్ ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేశారు. భోపాల్ కు చెందిన జాగృతి అవస్థి రెండో ర్యాంక్ సాధించారు. ఈమె ప్రస్తుతం బీహెచ్ఈఎల్ లో వర్క్ చేస్తున్నారు. అంకితా జైన్, యశ్ జలుకా, మమతా యాదవ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.