పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడ పరిధిలోని అంబర్ నగర్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో అంబర్ నగర్ ప్రాంతంలో గురువారం దాడులు నిర్వహించారు. Peach777.com అనే వెబ్సైట్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
నిందితుల్లో సబ్ బుకీగా వ్యవహరిస్తున్న చింతకింది సాయి కిరణ్‌తో పాటు బెట్టింగ్ వేస్తున్న (పంటర్లు) గంట శ్యామ్ ప్రసాద్, సుంకరి రాకేశ్, సయ్యద్ హయాత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన బుకీగా భావిస్తున్న మాంటీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.1,08,500 నగదు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సాయి కిరణ్‌ను రిమాండ్‌కు తరలించామని, వారాసిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు.

