మా దేశంలో అడుగు పెట్టండి: బీసీసీఐకి నమీబియా కెప్టెన్ అభ్యర్థన

మా దేశంలో అడుగు పెట్టండి: బీసీసీఐకి నమీబియా కెప్టెన్ అభ్యర్థన

స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్ట్ సిరీస్‌లు ముగిసిన అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం(జూన్ 21) ప్రకటించింది. సఫారీ పర్యటనలో టీమిండియా..  ఆతిథ్య జట్టుతో నాలుగు టీ20లు ఆడనుంది. 

ఈ సిరీస్ నవంబర్ 08 నుండి నవంబర్ 15 మధ్య జరగనుంది. వరుసగా డర్బన్, గెబెర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్‌ వేదికలు టీ20 సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. బీసీసీఐ షెడ్యూల్‌ను ధృవీకరించడంతో, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ భారత క్రికెట్ బోర్డుకు ఒక అభ్యర్థన చేశాడు. 

సఫారీలతో తలపడే ముందు తమ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడాలని కోరాడు. దక్షిణాఫ్రికాకు వెళ్లే మార్గంలో విండ్‌హోక్‌లో భారత జట్టు సన్నాహక మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అందుకు బీసీసీఐ అంగీకరిస్తే, ఈ నిర్ణయం తమ దేశంలో క్రీడలపై పట్టును పెంచుతుందని ఎరాస్మస్ అభిప్రాయపడ్డాడు. 

"హే @BCCI , విండ్‌హోక్‌లో సన్నాహకమా? " అని ఎరాస్మస్ ఎక్స్(ట్విట్టర్‌) పోస్ట్ చేశాడు.

భారత జట్టు.. దక్షిణాఫ్రికా పర్యటన 2024 షెడ్యూల్

  • మొదటి టీ20: నవంబర్ 08 (డర్బన్, రాత్రి 9.30)
  • రెండో టీ20: నవంబర్ 10 (గెబర్హా, రాత్రి 9.30)
  • మూడో టీ20: నవంబర్ 13 (సెంచూరియన్, రాత్రి 9.30)
  • నాలుగో టీ20: నవంబర్ 15 (జోహన్నెస్‌బర్గ్, రాత్రి 9.30)