ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులే : ఏఐకేఎఫ్‍

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులే : ఏఐకేఎఫ్‍

వరంగల్‍ : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‍రెడ్డి రైతు సంఘాల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏఐకేఎఫ్‍ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్‍, రిటైర్డ్ ప్రొఫెసర్లు యాదగిరా చార్యులు, వెంకటనారాయణ హెచ్చరించారు. మంగళవారం వరంగల్ అండర్‍ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్‍ భవన్‍లో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. రైతు ప్రభుత్వమంటూ ప్రచారం చేసుకునే కేసీఆర్‍ ప్రభుత్వం ఎనిమిదేండ్లు గడిచాక కూడా ఆత్మహత్యలు ఆపలేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే అందులో 14 లక్షల మంది కౌలు రైతులున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రంలో కౌలు రైతులకు లోన్‍ ఎలిజిబిలిటీ కార్డులు ఇవ్వడం ద్వారా బ్యాంక్‍ లోన్లు, సబ్సిడీ, నష్టపరిహారాలు ఇచ్చారని అన్నారు.

తెలంగాణ వచ్చాక ఏర్పడిన ప్రభుత్వం కౌలు రైతులను ఆగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులకు ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్పించి కనీస మద్దతు ధర, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం ఇవ్వట్లేదని మండిపడ్డారు. మార్కెట్‍ దోపిడీ అరికట్టకుండా రైతులను దోచుకునేవారికే వత్తాసు పలుకుతోందని విమర్శించారు. రైతుల మేలు కోరే సంఘాలను ఉరికిచ్చి కొడతామని బెదిరించడం పల్లాకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజేశ్వర్‍రెడ్డి ‘రైతు శత్రువు సమితి’ చైర్మన్‍లా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రైతు సంఘాలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‍ చేశారు. సమావేశంలో ఏఐకేఎంఎస్‍ జిల్లా బాధ్యులు రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఓదెల రాజన్న, ఏఐఎఫ్‍డీఎస్‍ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏఐసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్‍, ఏఐఎఫ్‍డీవై రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద రవి తదితరులు పాల్గొన్నారు.