నా ఫోన్లో నేను మాట్లాడేది సీక్రేట్ గా వింటున్రు: రాహుల్ గాంధీ

నా ఫోన్లో నేను మాట్లాడేది సీక్రేట్ గా వింటున్రు: రాహుల్ గాంధీ

దేశ ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం దాడికి గురవుతోందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్ ను ఉపయోగించి తనపై గూఢచర్యం చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్... కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని కీలక ఆరోపణలు చేశారు. అందులో భాగంగా తన ఫోన్‌లోనూ పెగాసస్ స్పైవేర్ చొప్పించారన్నారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉందన్న ఆయన.. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పినట్టు తెలిపాపు. దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. 

గతేడాది ఆగస్టులో స్నూపింగ్ కోసం పెగాసస్‌ను ప్రభుత్వం ఉపయోగించుకుందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. తమ పరిశీలనలో భాగంగా 29 మొబైల్ ఫోన్‌లను చెక్ చేయగా.. స్పైవేర్ కనిపించలేదని, అయితే ఐదు ఫోన్లలో మాత్రం మాల్వేర్ ఉందని తెలిపింది. కానీ అది కూడా  పెగాసస్ అని చెప్పలేమని టెక్నికల్ కమిటీ తెలిపింది. ఈ క్రమంలోనే దేశంలో పార్లమెంటు, పత్రికలు, న్యాయవ్యవస్థపై ఆంక్షలు విధించబడుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.