IND vs ENG 2025: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు.. ఎవరు గెలుచుకున్నారంటే..?

IND vs ENG 2025: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు.. ఎవరు గెలుచుకున్నారంటే..?

ఇంగ్లాండ్ పై ఓవల్ టెస్ట్ విజయంతో టీమిండియా ఫుల్ ఖుషీలో కనిపిస్తోంది. సోమవారం (ఆగస్టు 4) ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. రెండు ఇన్నింగ్స్ ల్లో 9 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇద్దరిని వరించింది. టీమిండియా కెప్టెన్ గిల్ తో పాటు హ్యారీ బ్రూక్ ఈ అవార్డు గెలుచుకున్నారు.

గిల్ ఐదు మ్యాచ్‌ల్లో ఆడి నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేయగా.. బ్రూక్ ఐదు మ్యాచ్‌ల్లో 481 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో ఈ అవార్డులు టీమిండియా ప్లేయర్లకే లభించడం విశేషం. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో మరో సర్ ప్రైజ్ అవార్డును ప్రదానం చేశారు. ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకోవడం విశేషం. సుందర్‌కు కుల్దీప్ యాదవ్ మెడల్ ను అందజేశాడు.

 "ఇంగ్లాండ్ లాంటి పరిస్థితుల్లో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఆడడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఎప్పుడూ బాగా రాణించాలని కోరుకుంటాను". అని సుందర్ అవార్డు అందుకున్న తర్వాత తన సహచరులను ఉద్దేశించి అన్నాడు. ఈ సిరీస్ లో సుందర్ అంచనాలకు మించి రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ లో 8 ఇన్నింగ్స్ ల్లో 284 పరుగులు చేశాడు. వీటిలో మాంచెస్టర్ లో కొట్టిన సెంచరీతో పాటు ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో హాఫ్ సెంచరీ ఉంది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి స్పిన్ అనుకూలించని ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టాడు. 

రవీంద్ర జడేజా 500 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు కూడా పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ నాలుగు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు.. మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. కెఎల్ రాహుల్ 532 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జైశ్వాల్ 411 పరుగులు చేశాడు. వీరెవరికీ కాకుండా సుందర్ కు ఈ అవార్డు లభించడం విశేషం.