హైదరాబాద్ లో నిర్మాణ వ్యర్థాలు కొండంత.. అవగాహన అంతంతే.. GHMC జరిమానాలు వేస్తున్నా .. జనాల తీరు మారడంలేదు

హైదరాబాద్ లో నిర్మాణ వ్యర్థాలు కొండంత.. అవగాహన అంతంతే.. GHMC  జరిమానాలు వేస్తున్నా ..  జనాల తీరు మారడంలేదు
  • రీ స్లైక్లింగ్​కు ప్లాంట్లు ఉన్నా రోడ్ల పక్కనే వేస్టేజీ
  • తగినంత ప్రచారం కల్పించకపోవడం వల్లే..
  • రీసైక్లింగ్​ చేసి ఇసుక, కంకర, టైల్స్, పేవర్ బ్లాక్స్, మ్యాన్ హోల్ మూతల ఉత్పత్తి 
  • బయటి మార్కెట్ తో పోలిస్తే 50 శాతం తక్కువ ధరలు
  • బల్దియా ప్రోత్సాహం లేక  ప్లాంట్ల వస్తువులకు నో డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ చేయడంలో గ్రేటర్​హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. నిర్మాణ వ్యర్థాలతో ఇసుక, కంకరా, పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్, పేవర్ బ్లాక్స్, కర్బ్ స్టోన్లు, మ్యాన్ హోల్ మూతలు ఉత్పత్తి చేస్తున్నారు.

 ప్రస్తుతం గ్రేటర్ లో 3500 నుంచి 4 వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు వెలువడుతున్నాయి. నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తూమ్ కుంట ప్రాంతాల్లో కన్​స్ట్రక్షన్​అండ్ డిమాలిష్ (సీఅండ్ డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేట్, పార్ట్ నర్ షిప్ (పీపీపీ) మోడ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఇందులో శంషాబాద్, తూమ్ కుంట ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను ఎస్ఎస్ఆర్ఈసీ సంస్థ బాధ్యతలు తీసుకుంది. అన్ని అనుమతులు పొంది 2024 నుంచి ఈ ప్లాంట్లు కొనసాగుతున్నా అధికారికంగా మాత్రం ప్రారంభించలేదు. అలాగే, 2020లో జీడిమెట్ల ప్లాంట్, 2021లో ఫతుల్లాగూడ ప్లాంట్ల ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్లాంట్లను రాంకీ నిర్వహిస్తుంది. 

ఒక్కో ప్లాంట్​లో 500 టన్నులు ప్రాసెస్​ చేయొచ్చు

ఒక్కో ప్లాంట్ లో డైలీ 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల ప్రాసెస్ చేసేందుకు వీలుంది. గ్రేటర్ లో వెలువడే నిర్మాణ వ్యర్థాలను సేకరించి ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం టన్నుకి దూరాన్ని బట్టి రూ.425 నుంచి రూ.456 వరకు తీసుకుంటున్నారు. నేరుగా ప్లాంట్ కి సొంత వాహనాల్లో తరలిస్తే మెట్రిక్ టన్నుకి రూ.105 నుంచి రూ.114 వరకు తీసుకుంటున్నారు. 

రీస్లైక్లింగ్​ ఉత్పత్తులను పట్టించుకోవట్లే

రీసైక్లింగ్ ద్వారా ఉత్పత్తి అయిన వస్తువుల కొనుగోలు చేసే విషయాన్ని జీహెచ్ఎంసీ, ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు వేస్తే జీహెచ్ఎంసీ భారీగా జరిమానాలు వేస్తున్నా ఉత్పత్తి అయిన వస్తువుల కొనుగోలు సంగతి మాత్రం పట్టించుకోవడంలేదు. 

కనీసం జీహెచ్ఎంసీ చేసే పనులకు కూడా ఈ వస్తువులను వాడడం లేదు. జీహెచ్ఎంసీ చేసే పనులకు కనీసం 20 శాతం ఈ వస్తువులను వాడాలనే పాలసీ ఉన్నప్పటికీ ఇంజినీర్లు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంలో కాంట్రాక్టర్లు బయట నుంచే కొనుగోలు చేస్తున్నారు. బయటి మార్కెట్లతో పోలిస్తే సీ అండ్ డీ ప్లాంట్లలో రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. 

రాయల్టీ ఫీజు లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు ట్రాన్స్ పోర్టు ఛార్జీలు లేకపోవడంతో దాదాపు అన్నింటిపై 50 శాతం వరకు రేట్లు తక్కువగా ఉన్నాయి.  ఇసుక ప్రస్తుతం బయటి మార్కెట్ లో టన్నుకి రూ.2600 నుంచి రూ.3000 వరకు ఉంది. అదే సీ అండ్ డీ ప్లాంట్లలో టన్ను కి రూ.800 నుంచి రూ.900 వరకు  ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సీ అండ్ డీ ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు డిమాండ్ లేనట్లుగా తెలుస్తోంది. 

తరలించాల్సిందిలా....

నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తరలించేందుకు జీహెచ్ఎంసీ వెబ్ సైట్, మై జీహెచ్ఎంసీ యాప్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఈ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది.  కూకట్ పల్లి  జోన్ లో మూసాపేట్, కూకట్ పల్లి, గాజులరామారం, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి జోన్ లో యూసుఫ్ గూడ, చందానగర్, శేర్​లింగంపల్లి, ఆర్ సీ పురం సర్కిల్స్​కు, సికింద్రాబాద్ జోన్ లో అంబర్​పేట్​, ఎల్ బీనగర్ జోన్ లో ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, చార్మినార్ జోన్ లో మలక్ పేట్, సంతోష్ నగర్ సర్కిల్స్​లో ఫతుల్లగూడ, జీడిమెట్ల ప్లాంట్ల కు సంబంధించిన వాట్సాప్ నెంబర్ 9100 927 073 కు, టోల్ ఫ్రీ నెంబర్ అయితే 1800- 120 - 1159  కు కాల్ చేస్తే వారు ఇంటికి వచ్చి నిర్మాణ వ్యర్థాలు తీసుకువెళ్తారు.

ఇందుకు టన్నుకు రూ. 425-, స్వయంగా వ్యర్థాలను ప్లాంట్ కి తరలిస్తే  టన్నుకు రూ.105 తీసుకుంటున్నారు.  ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ సర్కిల్ తో పాటు, చార్మినార్ జోన్లో చంద్రాయణగుట్ట, ఫలక్ నామా, చార్మినార్, రాజేంద్రనగర్ సర్కిల్, కూకట్ పల్లి, అల్వాల్, సికింద్రాబాద్ జోన్ లో మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్ నిర్మాణ వ్యర్థాలు సేకరణకు తూంకుంట, శంషాబాద్ ప్లాంట్ సంబంధించిన వాట్సాప్ నంబర్ 73300 00203 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-203-0033 కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వ్యర్థాలను తీసుకువెళ్తారు. ఇందుకోసం మెట్రిక్ టన్నుకు రూ.456,నేరుగా ప్లాంట్ కి తీసుకొస్తే మెట్రిక్ టన్నుకు రూ. 114 చెల్లించాల్సి ఉంది.

జరిమానాలు వేసినా..

గ్రేటర్ లో పాత ఇండ్ల స్థానంలో కొత్తగా నిర్మించే వారు పాత ఇంటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ఇండ్లను భవన నిర్మాణ వ్యర్థాల రీసైకిలింగ్ (సీ అండ్ డీ) ప్లాంట్లకు తరలించాలని జీహెచ్ఎంసీ చెప్తున్నా ఎక్కువ ఖర్చవుతుందని రాత్రి వేళ రోడ్లపై పారవేస్తున్నారు. దీంతో రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు వాహనదారులు తక్కువ ఖర్చుతో వ్యర్థాలు తీసుకెళ్తామని చెప్పి రాత్రి వేళ రోడ్లపై వేస్తున్నారు. ఇలాంటి వారు దొరికితే రూ.5వేల నుంచి రూ.50వేల వరకు ఫైన్లు వేస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా ఇప్పుడిప్పుడు మార్పు వస్తోంది. కానీ, వ్యర్థాల ద్వారా తిరిగి ఉత్పత్తి అయిన వస్తువుల కొనుగోలులో మాత్రం అవగాహన కల్పించలేకపోతోంది.