- గతేడాది మే నెలలోనే జూరాలకు వరద
- జూన్‌లో ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
- మహారాష్ట్రలో వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నప్రాణహిత
గద్వాల/కాగజ్ నగర్, వెలుగు: జూరాల వద్ద కృష్ణమ్మ వెలవెలబోతున్నది. ఈ ఏడాది ఎగువన వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదికి వరదలు రాక ప్రాజెక్టు దిగువన ఇసుక, రాళ్లు తేలి కనిపిస్తున్నది. పాత కాలపు సామెత ‘ఏరు ముందా ఏరువాక ముందా?’ అంటే ఈ ఏడాది ఏరువాకే ముందు వచ్చిందిగాని, వరద రాలేదు. గతేడాది మే 27 నుంచే జూరాలకు ఇన్ ఫ్లో ప్రారంభమైంది. అప్పటి వరకు3.2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. మే 29 నాటికి 7.78 టీఎంసీలకు చేరింది. అదే రోజు రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కావడంతో ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదిలారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు 2025 మే 29 నుంచి వరద ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రాజెక్టులో 39 టీఎంసీల నీరు ఉండగా.. క్రమంగా జూన్ 3 వరకు వరద కొనసాగడంతో 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జూన్ మొదటి వారం నుంచి ఆఫీసర్లు లిఫ్టులను ప్రారంభించారు. జూరాల పరిధిలోని భీమా లిఫ్ట్–1, లిఫ్ట్–2, కోయిల్‌సాగర్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, ఆర్డీఎస్ ప్యార్లల్ కెనాల్స్‌కు నీటిని వదిలారు.
ఇలా గతేడాది జూన్ నెలలోనే వరద నీటితో కళకళలాడాల్సిన కృష్ణమ్మ ఈ ఏడాది జులై నెల ప్రారంభమైనప్పటికీ వరదలు లేక బోసిపోతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 2.327టీఎంసీల నీరే ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
పరవళ్లు తొక్కుతున్నప్రాణహిత
జూరాల వెలవెలబోతుంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది మాత్రం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదిలోకి కొత్త నీరు చేరుతుండటంతో రెండు రోజులుగా ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
తుమ్మడిహట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. ఏటా జూన్ మాసం చివరి వారంలో నదికి కొత్తనీరు వస్తుండేది.ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ తో వానలు ఆలస్యం కాగా జులై మాసం ప్రారంభంలో వరద ప్రవాహం పెరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద వార్ధా, వైన్ గంగల సంగమంతో ఏర్పడే ప్రాణహిత ఉప్పొంగితూ ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది.
అయ్యో.. కుంటాల !
రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం వర్షాలు లేక కళ తప్పింది. గతేడాది జూలై ప్రారంభానికి వరద నీరుతో కళకళలాడిన జలపాతం ఈ ఏడాది వానలేక కళావిహీనంగా దర్శనమిస్తున్నది. దీంతో జలపాతాన్ని చూడడానికి వస్తున్న సందర్శకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
