నీళ్లు, పాలు, ఆయిల్‍, పసుపు, కారం అన్నీ కల్తీ 

నీళ్లు, పాలు, ఆయిల్‍, పసుపు, కారం అన్నీ కల్తీ 
  • కల్తీ పెరుగుతున్నా.. కంట్రోల్‍ చేస్తలేరు
  • చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో దాచిపెట్టిన ఫుడ్​ని.. 
  • వాడిన ఆయిల్‍తో మళ్లీ ఫాస్ట్​ఫుడ్​ వంటకాలు 
  • 33 జిల్లాలకు కేసులు రాసేది నలుగురు ఆఫీసర్లే 
  • రంగు, రుచి చూసి రోగాలపాలవుతున్న పబ్లిక్‍  

వరంగల్ రూరల్/ఆసిఫాబాద్​, వెలుగు: కమ్మని వాసన.. కలర్‍ఫుల్‍ లైటింగ్‍.. పెనంలో చేప ముక్కలు.. సీకులకు చికెన్‍ ముక్కలు.. అద్దాల బాక్స్​లో నంబర్‍ ఆఫ్‍ నాన్‍వెజ్‍ వెరైటీలు.. గాలిలో గరిటె తిప్పే నార్త్ సైడ్‍ చెఫ్‍లు.. ఇదంతా డైరెక్ట్ చూసేటోళ్ల నోట్లో నీళ్లు ఊరడం స్టార్ట్​ అయితది. నిమిషం ఆలస్యం చేయకుండా ప్లేట్లకు ప్లేట్లు ఆర్డర్‍ ఇస్తున్నరు. హాట్‍హాట్ పొగలు ఉన్నప్పుడే టపీమని కడుపులో పడేస్తున్నరు. ‘మేడి పండు చూడు.. మేలిమై ఉండు’ చందంగా మనం తినే ఫుడ్‍లో కల్తీ ఉందనే విషయాన్ని  పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ.. ఇలాంటి కల్తీలను కంట్రోల్‍ చేయాల్సిన డిపార్టుమెంటోళ్లు ఏమైనా సీరియస్‍ డ్యూటీలు చేస్తున్నారా అంటే అదీ లేదు. రాష్ట్రంలో ‘ఫుడ్‍ సేఫ్టీ అండ్‍ కంట్రోల్‍ బోర్డ్​’ ఒకటి ఉందనే విషయం కూడా అందరూ మరిచిపోతున్నరు. 

బొక్కల నూనె.. పాచిపోయిన చికెన్‍.. 
రాష్ట్రంలో దాదాపు 80 నుంచి 90 శాతం ఫుడ్‍ కోర్టుల్లో కల్తీ ఫుడ్ దందా నడుస్తోంది. చికెన్‍, మటన్‍, ఉప్పు, పప్పు, ఆయిల్‍, కారం, పసుపు.. చెప్పుకుంటూ వెళితే మనం ఆర్డరిచ్చే ఆహారం నిండా  కల్తీ కలుస్తోంది. రేటును బట్టి లేదంటే హోటల్‍, రెస్టారెంట్‍ మెయింటనెన్స్​ను బట్టి క్వాలిటీ ఉంటోంది. అప్పటికే వంటకాల్లో సెకండ్‍, థర్డ్​ గ్రేడ్‍ ఆయిల్‍, బిర్యానీ అయితే కొన్నిచోట్ల బొక్కల నూనె వాడుతున్నారు. ఇది చాలదన్నట్లు చాలాచోట్ల వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు. నల్లని కలర్ వచ్చేవరకు మసిలిన నూనెలో చికెన్‍, మటన్‍, ఫిష్‍ ఫ్రై చేస్తున్నారు. అయినా అడిగేవారు లేరు. పబ్లిక్‍ హెల్త్​ గురించి పట్టించుకునేవారు కనపడట్లేదు. నైట్‍ అమ్ముడుపోని ఐటమ్స్, పాడైన చికెన్‍, మటన్‍  ఫ్రిజ్​లో పెట్టి మళ్లీ తెల్లారి కిచెన్‍లో హాట్‍హాట్‍గా వేడి చేసి ఇస్తున్నా కనీసం తనిఖీలు చేసేవారు కరువయ్యారు.

 

పేరు గొప్ప.. ఊరు దిబ్బ..
రాష్ట్రంలో లక్షలాది హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ పుడ్‍ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా గల్లీకి నాలుగు ఉంటున్నాయి. కాగా, కల్తీ కంట్రోల్‍ చేయడంలో ఫుడ్ సేఫ్టీ, కంట్రోల్ డిపార్టుమెంట్‍ పాత్ర చాలా ఇంపార్టెంట్‍. హోటల్‍, రెస్టారెంట్‍, ఫుడ్‍ కోర్ట్  ఓపెన్‍ చేయాలంటే వీళ్లదే కీ రోల్‍.  ‘ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ యాక్టు2014’ ప్రకారం లైసెన్సుల పరిశీలన, మంజూరు.. హోట‌ళ్లు, రెస్టారెంట్లపై దాడులు, శాంపిళ్ల సేరకణ, కల్తీ పదార్థాలను ల్యాబ్‍కు తరలింపు, పరీక్షల ఆధారంగా ఫుడ్‍ ఐటెమ్స్​ హానికరంగా ఉంటే.. కమిషనర్‍ ఆదేశానుసారం కోర్టు కేసులు చూసుకోవడం..  జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడం వంటి ఎన్నో డ్యూటీలు చేయాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇవి కనపడవు. ఒక్కో జిల్లా పరిధిలో  ఎన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్​ఫుడ్‍ సెంటర్లు ఉన్నాయో చెప్పలేని దుస్థితిలో ఉంది ఆ డిపార్ట్​మెంట్​. శాఖ నుంచి పర్మిషన్‍, లైసెన్స్​ లేకుండా నడుస్తున్న దుకాణాలు చిన్న జిల్లాల్లోనే వేలల్లో ఉంటున్నాయి.

33 జిల్లాలు.. నలుగురు గెజిటెడ్‍ ఫుడ్ ఇన్​స్పెక్టర్లు
స్టేట్​లోని 33 జిల్లాల్లో  ఫుడ్‍ కల్తీ కంట్రోల్​కు సర్కార్‍ కేవలం నలుగురు గెజిటెడ్‍ ఇన్​స్పెక్టర్లతో నడిపిస్తోంది. జిల్లాల్లో తనిఖీలు చేసే అధికారం ఫుడ్‍ సేఫ్టీ ఆఫీసర్లకున్నా.. కోర్టులు, కేసులు, ఫుడ్‍ టెస్టింగ్‍  ఇష్యూస్‍ అన్నీ గెజిటెడ్‍ ఫుడ్ ఇన్స్పెక్టర్‍ మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఈ అంశాల్లో మిగతావారికి అధికారం ఉండదు. జిల్లాల పరిధిలో సిబ్బందికి జీతాలు కావాలన్నా.. గెజిటెడ్‍ ఇన్స్​పెక్టర్‍ ఆ ఫైళ్ల మీద సంతకాలు చేయాల్సి ఉంది. ఉదాహరణకు చూస్తే..వరంగల్‍ అర్బన్‍, వరంగల్‍ రూరల్‍, జనగామ, భూపాలపల్లి జయశంకర్‍, ములుగు, మహబూబాబాద్‍, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‍, మంచిర్యాల, నిర్మల్‍, కరీంనగర్‍, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల , జగిత్యాల,  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం..మొత్తం 16 జిల్లాలకు ఒకే ఒక్క  గెజిటెడ్ ఫుడ్ ఇన్​స్పెక్టర్‍గా అమృతశ్రీ పనిచేస్తున్నారు. ఆమె రోజుకు రెండుమూడు జిల్లాలు కవర్‍ చేసినా వారానికి ఒకరోజు ఓ జిల్లాలో ఉండలేని పరిస్థితి డిపార్టుమెంట్​లో ఉంది. గతంలో ఈ హోదాలో పనిచేసిన రాజేంద్రనాథ్‍కు యాక్సిడెంట్‍ జరిగి రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. 16 జిల్లాలను చూసే క్రమంలో గెజిటెడ్‍ ఆఫీసర్‍ ఎప్పుడు చూసినా జర్నీలోనే ఉంటున్నారు.  దాదాపు ఏ జిల్లాలో వీరికి సర్కార్‍ ఆఫీసులు లేవు. జిల్లాకు ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాల్సినచోట ఒక్కో ఆఫీసర్‍ రెండు, మూడు జిల్లాలు చూస్తున్నారు. మధ్యలో  కొందరిని రిక్రూట్‍ చేసినా.. గెజిట్‍ నోటిఫై ఇవ్వని కారణంగా వారు అఫిషియల్‍గా డ్యూటీల్లో చేరలేకపోతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఫుడ్‍ కల్తీ ఆగట్లేదు. ఫుడ్‍ సేఫ్టీ ఇచ్చేవారు లేరనేది స్పష్టమవుతోంది.

పని ఒత్తిడి భరించలేక పోతున్నా..
మా డిపార్ట్​మెంట్​లో స్టాప్ లేనందున ఏ పనీ అయితలేదు. నా రెగ్యులర్ పోస్ట్ నిజామాబాద్ జిల్లాలో. కానీ ఉమ్మడి నిజామాబాద్ తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఇన్​చార్జి బాధ్యతలు చూస్తున్న. ఆఫీస్​ వర్క్, స్టాఫ్​ జీతాలు, కోర్టు కేసులు, డిపార్ట్​మెంట్​మీటింగ్​లు, కలెక్టర్ల మీటింగ్​లు, ఫుడ్ పాయిజన్ కేసుల పర్యవేక్షణ  ఒక్కన్నే చూడాల్సి వస్తోంది. ఆలయాల్లో నిర్వహించే పెద్ద పెద్ద జాతరలకు తప్పనిసరిగా వెళ్లి, పూర్తయ్యే వరకు ఉండాలి. ఇంత  పని ఒత్తిడి భరించలేక పోతున్న.    – టి.నాయక్ , ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్​చార్జ్​

కేసులు పెట్టరు.. శిక్షలు పడవు 
రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‍ సెంటర్లలో కళ్లెదుటే కల్తీ జరుగుతున్నా కేసులు పెట్టేవారు కరువయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటో, రెండో కేసులు రాసినా అందులో ఎవరికి శిక్షలు పడవు. రెగ్యూలర్‍గా తనిఖీలు చేపట్టాల్సిన ఫుడ్‍ సేఫ్టీ ఆఫీసర్లు ఏదైనా ఘటన జరిగితే తప్పితే రెస్టారెంట్ల వైపు చూసింది లేదు. అడపాదడపా కస్టమర్లే ఆహార‌ క‌ల్తీపై కంప్లైంట్‍ చేయడమో లేదంటే వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెడితే తప్పితే డిపార్ట్​మెంట్​ నుంచి ఎవరూ రెస్పాండ్‍ అవని దుస్థితి. విషయం వారి దృష్టికి వచ్చినా ఏం చేయలేరు. ఎందుకంటే..ఆఫీసర్లు వచ్చేలోపే హోటల్‍ ఓనర్లు కల్తీ ఫుడ్‍ను అక్కడి నుంచి తీసేస్తున్నారు. దీంతో కేసులు నిల‌వ‌డం లేదు. ఒక్కోసారి రైడింగ్​లో కల్తీ ఫుడ్‍ ఇతరత్రా దొరికినా సెటిల్‍మెంట్‍ దందాతో కేసులు కోర్ట్ వరకు వెళ్లట్లేదు. చాలా జిల్లాల్లో శాఖ తరఫున లైసెన్స్‍ ఎంక్వైరీ, పర్మిషన్‍ ఇవ్వాలంటే ఒక్కో దానికి ఒక్కో రేటు నడుస్తోంది.   

జిల్లా పరిధిలో ఉండాల్సిన సిబ్బంది

ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్​స్పెక్టర్
ఇద్దరు నాన్ గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు
ఒక ఎల్డీసీ
ముగ్గురు అటెండర్లు
ఆఫీస్‍, కంప్యూటర్లు, ఆపరేటర్లు

33 జిల్లాలకు కలిపి ప్రస్తుతం పనిచేస్తున్నది
33 మంది గెజిటెడ్​ ఫుడ్​ ఇన్​స్పెక్టర్లకు గాను కేవలం నలుగురు
66 మంది నాన్​గెజిటెడ్​ ఫుడ్​ సేఫ్టీ అధికారులకుగాను ఉన్నది 15 మందే