
- ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు షురూ
- అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- నేడు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఊరేగింపు
న్యూఢిల్లీ, వెలుగు:లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఆయన బంగారు బోనాన్ని తలపై ఎత్తుకొని.. పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పదేండ్లుగా ఆలయ కమిటీ ఢిల్లీలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ సన్మానించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఢిల్లీలో నిరాటంకంగా లాల్ దర్వాజా బోనాలు నిర్వహిస్తున్న సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశ రాజధాని ఢిల్లీలో చాటుతూ.. సమాజానికి శక్తినిచ్చేలా అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మూడు రోజులు పాటు ఈ బోనాల ఉత్సవాలు సాగనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి గద్దెల ఊరేగింపు, ఘట స్థాపన ఉంటుందన్నారు. బుధవారం పోతరాజు స్వాగతం, తెలంగాణ ప్రజల కళలను ప్రతిబింబించే సాంస్కృతిక నృత్యాలు, అమ్మవారికి బంగారు బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ప్రధానితో గవర్నర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో ఆయనతో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించినట్లు గవర్నర్ ఆఫీసు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ సమావేశంపై సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా స్పందించారు.