
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో తిరుమల, తిరుపతి ప్రాంతాలలోని అన్ని డ్యాములలో నీటి లభ్యత, వినియోగంపై అధికారులతో మంగళవారం (ఆగస్ట్ 19) సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలోని డ్యాముల దృఢత్వంపై సమగ్ర నివేదిక అందించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత నీటి నిల్వలు 2025 డిసెంబర్ వరకు భక్తుల అవసరాలకు సరిపోతాయన్నారు. రాబోయే కార్తీక మాసంలో వర్షపాతం ఆధారంగా భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
తిరుమలలో గోగర్భం, కుమారధార, పసుపుధార, పాపవినసనం, ఆకాశగంగ, తిరుపతిలోని కళ్యాణి డ్యామ్‌లలో ప్రస్తుతం భక్తుల అవసరాలకు తగిన నీటి నిల్వలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి అవకాశాలను పరిశీలించాలన్నారు. గత 5 నుండి 10 సంవత్సరాల వరకు నీటి లభ్యత, వర్షపాతం, వినియోగం, వృథా విడుదలపై నిపుణులచే సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు.
నీటిని ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటే, నిరంతర సరఫరా సాధ్యమని చెప్పారు. తిరుమలలోని వాణిజ్య సంస్థల నీటి బకాయిలను సకాలంలో వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ ఈఈ శ్రీ సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.