జూబ్లీహిల్స్, వెలుగు: వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి పార్ట్ టైమ్ ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్ట్తోపాటు వెనక కూర్చున్న యువతి మృతిచెందింది. ఏపీలోని విజయనగరానికి చెందిన అక్షిత(20) చెఫ్‌గా విదేశాల్లో ఉద్యోగావకాశం రావడంతో అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. రెండ్రోజుల క్రితం వచ్చిన ఆమె బాలానగర్‌లోని తన ఫ్రెండ్ వద్ద స్టే చేస్తున్నది. అయితే, సోమవారం ఉదయం మెడికల్ సర్టిఫికెట్ కోసం మెహిదీపట్నంలోని ఓ ఆసుపత్రికి వెళ్లి తిరిగి బాలానగర్‌కు వెళ్లేందుకు ర్యాపిడో యాప్ ద్వారా బైక్ బుక్ చేసుకుంది.
ఈ క్రమంలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్ట్గా పనిచేస్తున్న మహమ్మద్ హుస్సేన్ నైట్‌డ్యూటీ ముగించుకుని పార్ట్ టైమ్ రైడ్‌లో భాగంగా ఆమెను పికప్ చేసుకొని బాలానగర్ వైపు బయలుదేరారు. బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్క్ సమీపంలోని మలుపు వద్దకు రాగానే, ఓ వాటర్ ట్యాంకర్ అతివేగంతో దూసుకొచ్చి వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఇద్దరిని పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకున్న యువతి, కుటుంబ పోషణ కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న హోంగార్డ్ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై ట్యాంకర్ డ్రైవర్ కాజా పాషా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
