మేమేంటో చూపిస్తం: ఆర్టీసీ కార్మికులు

మేమేంటో చూపిస్తం: ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, బెదిరింపులకు భయపడేది లేదని జేఏసీ కన్వీనర్‌‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఇట్లాంటి సీఎంలను చాలా మందిని చూశామన్నారు. ఉద్యమ సమయంలో సమ్మె చేసినప్పుడు సీఎం కిరణ్‌‌  బెదిరించినప్పుడు భయపడి ఉంటే.. తెలంగాణ రాష్ట్రమే రాకపోయేదన్నారు. ఇప్పుడు తాము భయపడటం ఏమిటన్నారు. సర్కారు మొదట ఆర్డర్స్‌‌ ఇచ్చి మాట్లాడాలని, అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్‌‌ పాపం పండిందని, ఆయన పతనానికి ఇది నాంది అని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రైవేట్‌‌ భాగస్వామ్యం అంతా సీఎం కుటుంబ సభ్యులదేనని, సంస్థను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 46 డిపోల్లో ఆర్టీసీ ప్రాపర్టీలను పెట్రోల్‌‌ బంక్‌‌ల పేరుతో సీఎం కుటుంబీకులు తీసుకున్నరని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, డిమాండ్లు నెరవేర్చేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరించారు. ప్రజా రవాణాను బతికించాలని కోరారు. రెండు రోజుల్లో ఎన్ని బస్సులు నడిపారో, ఎంత మందిని గమ్యస్థానాలకు చేర్చారో తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌‌ చేశారు. సమ్మె పాక్షికం అని ఓ పత్రిక ప్రచురించిందని, 50 వేల మంది పాల్గొంటే పాక్షికం ఎలా అవుతుందని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రికి అధికారులు వాస్తవ పరిస్థితులు తెలపాలన్నారు. ప్రభుత్వ తీరును అన్ని సంఘాలు ఖండించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే పిల్ వేయించిందని ఆరోపించారు.

ఒకరు ఇచ్చిన పదవి కాదు

ఆర్టీసీ ఇమేజి దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. రవాణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం నెలకొందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 16 వందల గ్రామాలకు బస్ సౌకర్యం లేదని, ఆరేండ్లుగా ఆర్టీసీలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని గుర్తు చేశారు. ఉద్యోగులను తీసేసే సత్తా మంత్రి పువ్వాడకు ఉందా అని ప్రశ్నించారు. ‘‘మాది మీలా ముఖ్యమంత్రి ఇచ్చిన మంత్రి పదవి కాదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు? తలసాని చాపల మంత్రి. ఆయనకు కార్మికుల సమస్యలేం తెలుసు? కార్మికుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తెలంగాణలో కీలక పాత్ర పోషించిన వాళ్ళను ప్రభుత్వం తొక్కేసే ప్రయత్నం చేస్తోంది.” అని ఆరోపించారు. జేఏసీ కో–కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ అద్దె బస్సులు వేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

తొలగించడానికి కేసీఆర్‌‌ జాగీరా?: హనుమంతు

కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడానికి ఇది ఏమన్న సీఎం జాగీరా అని ఆర్టీసీ జేఏసీ వన్‌‌ కన్వీనర్‌‌ హనుమంతు ముదిరాజ్‌‌ మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలతో కార్మికులు భయపడేది లేదన్నారు. కేసీఆర్‌‌ను సీఎం చేసిందే తామేనని, ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసినందుకు బాధపడుతున్నమన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని గన్‌‌పార్క్‌‌ వద్ద అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం రెండు గంటలపాటు అక్కడే బైఠాయిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌‌లో రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.